Breast Pain | స్తనాలలో నొప్పి కారణం అదేనా? ఉపశమనం కలిగించే మార్గాలు చూడండి!-breast pain reasons sore breasts during pregnancy home remedies to ease the pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breast Pain | స్తనాలలో నొప్పి కారణం అదేనా? ఉపశమనం కలిగించే మార్గాలు చూడండి!

Breast Pain | స్తనాలలో నొప్పి కారణం అదేనా? ఉపశమనం కలిగించే మార్గాలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Apr 06, 2023 04:03 PM IST

Breast Pain Remedies: మహిళలలో రొమ్ము నొప్పికి కారణాలు అనేకం. గర్భధారణ సమయంలో మరింత ఎక్కువ ఉండవచ్చు. ఈ నొప్పి నివారణ మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.

Breast Pain Reasons - Remedies
Breast Pain Reasons - Remedies (istock)

World Health Day 2023: చాలా మంది మహిళలు తమ స్తనాలలో నొప్పిని (Breast Pain) ఆనుభవించడం సాధారణ విషయమే. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకవైపు రొమ్ములో మాత్రమే ఈ నొప్పి ఉండగా, మరికొన్ని సార్లు రెండు రొమ్ములలో నొప్పి ఉండవచ్చు. ఈ నొప్పి రొమ్ములను పొడుస్తున్నట్లుగా పదునైన నొప్పి ఉండటం, లేదా స్తనాలను లాగినట్లుగా బిగుతుగా అనిపించడం, తాకితే కూడా నొప్పిగా అనిపించడం ఉంటుంది. రొమ్ములలో నొప్పి అనేక కారణాల వల్ల కలగవచ్చు, అయితే దీనిని రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) అనుకొని భయపడాల్సిన అవసరం లేదు. రొమ్ము క్యాన్సర్‌కు ఇది చాలా అసాధారణమైన లక్షణం.

స్థనాలలో నొప్పికి ప్రధాన కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు. ఎక్కువగా ఋతుస్రావం, యుక్తవయస్సు, రుతువిరతి, గర్భధారణ వంటి పరిస్థితులలో రొమ్ములలో కొంత నొప్పి ఉంటుంది. బ్రా సైజు సరిగ్గా లేకపోవడం, ఫైబ్రోసిస్టిక్ రొమ్ము వ్యాధితో కూడా ఈ రకమైన నొప్పితో సంబంధం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు ఛాతీలో కండరాలు లాగడం వలన కూడా నొప్పి వస్తుంది. దీనినే ఛాతీ గోడ నొప్పి (Chest Wall Pain) అంటారు.

Breast Pain Remedies- రొమ్ము నొప్పి నివారణ మార్గాలు

స్త్రీలు గర్భం (Pregnant women) ధరించినపుడు వారి శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ స్థితిలో స్తనాలలో నొప్పి అనేది చాలా సాధారణంగా కలిగే ఒక అసౌకర్యం. గర్భిణీ శరీరం పాల ఉత్పత్తికి (Breast Milk) సన్నద్ధమవుతున్నందున ఈ నొప్పి ఉండవచ్చు. అయితే చాలా అసౌకర్యంగా, బాధాకరంగా అనిపిస్తే ఉపశమనం కలిగించే కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.

సరైన బ్రా ఎంచుకోండి

గర్భధారణ సమయంలో మీ రొమ్ములు పెరుగుతాయి కాబట్టి, వాటికి మరింత మద్దతు అవసరం. సరైన పరిమాణం కలిగిన బ్రా వక్షోజాలకు అవసరమైన మద్దతును అందిస్తుంది. వక్షోజాలు సాగిపోకుండా (Sagging Breasts), కుంగిపోకుండా నిరోధించవచ్చు. బ్రా పట్టీలు మీ భుజాలపైకి రాకూడదు, అలాగే పక్కటెముక చుట్టూ ఉన్న బ్యాండ్‌లు సరిగ్గా అమరి ఉండాలి కానీ గట్టిగా ఉండకూడదు. అండర్‌వైర్ బ్రాలను నివారించండి ఎందుకంటే అవి రొమ్ము కణజాలంపై ఒత్తిడి తెచ్చి నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి.

వెచ్చదనం- చల్లదనం అందించండి

వెచ్చని కంప్రెస్ నొప్పిని తగ్గించడానికి, ఆ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, అయితే కోల్డ్ కంప్రెస్ వాపు, మంటను తగ్గిస్తుంది. మీరు వెచ్చదనం కోసం ఒక వెచ్చని టవల్ లేదా హీటింగ్ ప్యాడ్ ఉపయోగించవచ్చు. చల్లటి అనుభూతి కోసం ఐస్ ప్యాకెట్స్, కోల్డ్ జెల్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అయితే నేరుగా రొమ్ములపై ఉంచకుండా ఒక గుడ్డలో చుట్టి చల్లటి అనుభూతిని పొందండి, 15 నిమిషాల పాటు కోల్డ్ కంప్రెస్ తీసుకోవాలి.

వక్షోజాలను మసాజ్ చేయండి

వక్షోజాలలో నొప్పి ఉన్నప్పుడు వృత్తాకార కదలికలో వాటిని సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల స్తనాలలో రక్త ప్రసరణ, శోషరస పారుదల మెరుగుపడుతుంది, నొప్పి, వాపు తగ్గుతుంది. మీరు లూబ్రికేషన్ కోసం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. నూనెలతో ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు మీ వక్షోజాలను మృదువుగా మసాజ్ చేయడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

క్రీమ్ లేదా ఆయింట్మెంట్ రాయండి

నొప్పి తగ్గడానికి రొమ్ములపై కలబంద, క్యామోమైల్ వంటి సహజ పదార్ధాలను కలిగి ఉన్న క్రీమ్‌లు రాతండి. ఇవి నొప్పి, వాపును తగ్గించగల గుణాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఏదైనా కొత్త ఉత్పత్తులను ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఎంతకైనా మంచిది.

పోషకాహారం తీసుకోండి

రొమ్ము కణజాల పెరుగుదలకు తోడ్పడటానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి. రోజంతా నీరు పుష్కలంగా తీసుకోండి, హైడ్రేటెడ్ గా ఉండండి. కాఫీ, టీలను ఎక్కువగా తాగకండి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్‌ రొమ్ము నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా నొప్పి కొనసాగితే లేదా తీవ్రతరం అయితే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. గర్భధారణ సమయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మీకు, మీ బిడ్డ ఆరోగ్యానికి కీలకం అని గుర్తుంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం