Breast Milk Diet | చనుబాలు పెరగాలంటే ఈ ఆహారాలు తీసుకోండి!
Breast Milk Boosting Foods - బిడ్డను కనడం ఒక ఎత్తైతే ఆ బిడ్డను సంరక్షించడం మరో ఎత్తు. గర్భం నుంచి బయటకు వచ్చిన శిషువులకు తల్లి పాలు ఎంతో శ్రేయస్కరం. అయితే కొందరు తల్లులకు పాల ఉత్పత్తి సరిగా జరగదు. అలాంటి వారు ఈ ఆహారాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పుట్టిన శిషువులకు వారి తల్లులు కనీసం 6 నెలల పాటు చనుబాలను ఇవ్వాలని డాక్టర్లు సిఫారసు చేస్తారు. ఆరు నెలల తర్వాత ఇతర పోషకాహారం అందిస్తూ కూడా చనుబాలు ఇవ్వడం కొనసాగించాలి. అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఎదగగలుగుతుంది. తల్లిపాలు శిషువుకి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఏ శిషువుకైనా తల్లి చనుబాలను మించి సరితూగే ఏ పౌష్టికాహారం ఉండదు. అప్పటివరకు గర్భంలో ఉన్న శిషువు బయటకు వచ్చిన తర్వాత బయటి వాతావరణానికి అలవాటుపడాలంటే మెరుగైన రోగనిరోధక శక్తి అవసరం. ఇది తల్లి చనుబాలతోనే లభిస్తుంది. చనుబాలు శిషువుకి శక్తిని అందించడమే కాకుండా తేలికగా జీర్ణమయి శిషువు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇలా బిడ్డకు చనుబాలు అందివ్వడం తల్లికి కూడా ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. కాబట్టి నిర్ధిష్ట సమయం వరకు శిషువుకి చనుబాలు ఇవ్వడం ఆపకూడదు.
అయితే కొందరు తల్లులకు చనుబాల ఉత్పత్తి సరిగ్గా జరగదు. బిడ్డకు పాలు ఇద్దామన్నా పాలు రావు. ఇందుకు కారణం తల్లి పోషకాహార లోపాన్ని కలిగి ఉండవచ్చు. లేదా ఏదైనా అనారోగ్య సమస్య కావొచ్చు. పోషకాహార లోపంతో ఇబ్బందిపడే తల్లులు తమ చనుబాల ఉత్పత్తిని పెంచుకునేందుకు నిర్ధిష్టమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చనుబాల ఉత్పత్తిని పెంచే కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ సూచిస్తున్నాం. ఇవి ఎక్కువగా తీసుకోండి.
స్తన్యం పెంచే ఆహార పదార్థాలు
మెంతులు
మెంతులు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ హర్మోన్ గర్భిణీ స్త్రీలలో పాల ఉత్పత్తిని కలుగజేస్తుంది. ఆహారంలో సరైన మోతాదులో మెంతులు తీసుకోవడం ద్వారా స్తనాల్లో పాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు తెలిపాయి. మెంతులను కూరల్లో వేసుకోవచ్చు, మెంతికూరను కూడా తినవచ్చు. అయితే ఉబ్బసం కలిగిన స్త్రీలు ఈ మెంతులు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. వైద్యుల సలహా కోరండి.
ఓట్ మీల్
పాలిచ్చే తల్లులు ఓట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓట్స్ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. పాలలో కలిపి తీసుకోవచ్చు, బిస్కట్లు లేదా ఇతర అల్పాహారం లాగా తీసుకోవచ్చు. ఓట్స్‌లో ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపం ఉండే తల్లుల్లో పాల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అర కప్పు ఓట్స్‌లో దాదాపు 2 mg ఐరన్ లభిస్తుంది. పాలిచ్చే తల్లులకు రోజుకు సుమారు 20 శాతం ఐరన్ అవసరం ఉంటుంది.
ఫెన్నెల్ విత్తనాలు
సోంఫ్ విత్తనాల్లో కూడా మెంతుల్లో ఉన్నట్లుగా ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. కొద్ది మోతాదులో సోంఫ్ విత్తనాలు నమలడం, ఆహారాలతో కలిపి తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి పాలల్లో కొవ్వు పదార్థాలను కూడా పెంచుతాయి. తద్వారా శిషువు బరువు పెరగడానికి ఇవి సహాయపడతాయి.
మాంసం
పాలిచ్చే తల్లులు లేత మటన్, చికెన్ లాంటి శక్తివంతమైన ఆహారం తీసుకోవాలి. అలాగే అలవాటు ఉంటే పంది మాంసం కూడా తీసుకోవచ్చు. వీటిని తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్ ఇంకా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అవి పాల సరఫరాకు తోడ్పడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిలోని పోషకాలు కూడా పాల సరఫరాను పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు. లవంగాలు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. దాదాపు మన భారతీయ వంటకాల్లో వెల్లులి, జీలకర్ర, లవంగాలు సాధారణంగా ఉపయోగించేవే. అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి.
ఇక పాలకూర, పప్పు ధాన్యాలు కూడా తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒకవేళ ఎంత మంచి పోషకాహారం తీసుకున్నా పాల ఉత్పత్తి పెరగకపోతే సమస్య ఎక్కడుందో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించి అందుకు తగిన ఔషధాలను వాడాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం