Green Tea During Pregnancy | గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీని తాగటం సురక్షితమేనా?
Green Tea During Pregnancy: గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీని తాగటం మంచిదేనా? తాగితే ఎంత మోతాదు ఉండాలి? ఆరోగ్య నిపుణుల సిఫారసులను ఇక్కడ తెలుసుకోండి.
Green Tea During Pregnancy: ఫిట్‌గా ఉండాలని, మంచి ఫిజిక్ కలిగి ఉండాలని గ్రీన్ టీ తాగుతారు, ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ అంశంలో ముందుంటారు. చాలా మంది యువతులు రోజుకు అనేక కప్పుల గ్రీన్ టీ తాగటం ఒక అలవాటుగా మార్చుకుంటారు. మరి గర్భిణీ స్త్రీలకు గ్రీన్ టీ తీసుకోవడం సురక్షితమేనా? గర్భిణీలు గ్రీన్ టీ తాగొచ్చా? తినకూడదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మీ సందేహాన్ని ఇక్కడ నివృత్తి చేసుకోండి.
పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు తీసుకోకూడని పానీయాల జాబితాలో కెఫిన్ పానీయాలు ముందు వరుసలో ఉంటాయి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు సూచిస్తున్నాయి. కెఫిన్ ఉన్న ఎలాంటి పానీయాన్నైనా పరిమితి విధించుకోవాలి.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ దండిగానే ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, ఇతర సమయాల్లో మాదిరిగా గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు గరిష్టంగా రెండు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు.
గ్రీన్ టీలో ఉపాయోగించే చాయ్ పత్తి కామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుండి సేకరిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గర్భిణీలు దీనిని పరిమితంగా తీసుకుంటే ఇది ఆరోగ్య పానీయం. మోతాదు మించితే ఈ గ్రీన్ టీ శరీరంలోని ఫోలిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. అది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు.
గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది.
గర్భిణీలు గ్రీన్ టీ తాగితే కలిగే ఇతర అనారోగ్య సమస్యలు
గర్భధారణ సమయంలో స్త్రీలలో జీర్ణ సమస్యలు రాకూడదు. ఈ సమయంలో గర్భిణులకు జీర్ణశక్తి మెరుగ్గా ఉండాలి. అప్పుడే కడుపులో బిడ్డ ఎదిగేందుకు పోషణ లభిస్తుంది, అయితే ఈ కెఫిన్ కలిగిన పానీయాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. తద్వారా సరైన పోషణ అందదు.
గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీని రెగ్యులర్ గా కూడా తీసుకోవడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు. గర్భధారణ సమయంలో, మహిళల్లో జీవక్రియ వేగంగా ఉంటుంది. కెఫిన్ కంటెంట్ ఉన్న పానీయం తీసుకోవడం వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయని, మానసికంగా చాలా మార్పులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తీవ్రం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ కడుపులో బిడ్డకు హానికరమా?
గర్భిణీ స్త్రీలు తినే ఆహారం, మూలకాలు కడుపులో పిండం స్వీకరిస్తుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీ శరీరం ఆమె తినే ఆహారంలో ఉండే ఫోలిక్ యాసిడ్‌ను సరిగ్గా గ్రహించదు. దీని ప్రభావంతో పుట్టిన బిడ్డ పుట్టుకతోనే వెన్నుపాము సమస్యలను కలిగి ఉండవచ్చు.
గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన మొదటి 12 వారాలలో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవాలి. మీరు ఈ సమయంలో గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటే, మీరు ఈ ముఖ్యమైన విటమిన్‌ను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం