AP Ration Cards: ఏపీ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై కీలక అప్‌డేట్.. 10 ముఖ్యమైన అంశాలు
AP Govt : కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అలాగే కరెక్షన్ కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. అలాంటి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీని పూర్తి చేస్తామని వెల్లడించింది. దరఖాస్తు ప్రక్రియ గురించి అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ఇన్నాళ్లు ఎదురుచూపులే మిగిలాయి. నెలల తరబడి ఎదురు చూసినా కార్డులు దక్కలేదు. రెవెన్యూ ఆఫీసుల చుట్లూ తిరగినా ఫలితం లేదు. కొత్త కార్డుల సంగతి దేవుడెరుగు.. కనీసం మార్పులు, చేర్పులకూ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.డిసెంబరు 2వ తేదీ నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
2.డిసెంబరు 28 వరకు దరఖాస్తులు తీసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కొత్త కార్డులు అందజేస్తారు.
3.కొత్త కార్డులతో పాటు కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు, కొత్తగా పెళ్లైన వారిని కార్డుల నుంచి తొలగేందుకు, చిరునామా మార్పు, ఆధార్ నంబరు అనుసంధానం, వంటి ఏడు రకాల సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి.
4.గతంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
5.వినతులను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. కానీ అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.
6.ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
7.వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు.. పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.
8.అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు సంబంధించి.. విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.
9.మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశంపై ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్దిదారులకు మంజూరు చేసే.. కార్డు రంగుతోపాటు దానిపై ముద్రించే చిహ్నాలను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు వివరించారు.
10.రాష్ట్రం సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు కీలక ప్రామాణికంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వారి వివరాలను పరిశీలించి అనర్హులగా గుర్తించనుంది. వారి రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది.