Cheese: రోజులో చీజ్ ఎంత వరకు తినొచ్చు? అతిగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఇవే
Cheese: చీజ్ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు దక్కుతాయి. ఇటీవలి కాలంలో ఇది తినడం ఎక్కువైంది. అయితే, చీజ్ అతిగా తిన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చీజ్ రోజులో ఎంత తినొచ్చంటే..
వంటకాలకు చీజ్ మంచి రుచిని ఇస్తుంది. చాలా రకాల వంటల్లో చీజ్‍ను వాడేస్తున్నారు. ఇటీవలి కాలంలో చీజ్ తినడం మరింత ఎక్కువవుతోంది. స్నాక్స్, కర్రీల నుంచి దోశల వరకు చాలా వంటకాల్లో చీజ్‍ను వేస్తున్నారు. ప్రత్యేకంగా చీజ్‍తోనే కొన్ని రకాల వంటలు చేస్తున్నారు. పాలతో చేసే చీజ్ వల్ల ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అయితే, అతిగా తింటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి.
చీజ్‍లో కాల్షియం, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సీ12, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పాస్ఫరస్, రిబోఫ్లేవన్ సహా మరిన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి. దీంతో చీజ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొన్ని లాభాలు ఉంటాయి. అయితే, చీజ్‍లో ఫైబర్ తక్కువగా, సాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉండడం వల్ల పరిమితి మేరనే తీసుకోవాలి. మరీ ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
రోజులో ఎంత తినొచ్చు?
చీజ్‍ను రోజులో సుమారు 60 గ్రాముల నుంచి 80 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి కాకుండా రెండు, మూడుసార్లు విభజించి తీసుకోవాలి. మొత్తంగా రోజులో చీజ్‍ను 80 గ్రాములలోపే తీసుకుంటే మంచిది. ఈ మోతాదుకు మించి తింటే కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు.
చీజ్ అతిగా తింటే కలిగే దుష్ప్రభావాలు
బరువు పెరగడం: చీజ్‍లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీంతో ఇవి అతిగా తింటే శరీర బరువు పెరిగే రిస్క్ ఉంటుంది. ఇందులో ఫ్యాట్స్ కూడా ఎక్కువే. అందుకే సరైన శరీర బరువు మెయింటెన్ చేసేందుకు చీజ్‍ను మోతుదు మేరకే తీసుకోవాలి.
గుండెకు ముప్పు: చీజ్‍లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగేలా చేస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. అదే పరిమితిగా చీజ్ తింటే ఏ ప్రమాదం ఉండదు.
కడుపుకు ఇబ్బంది: చీజ్‍లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. లాక్టోస్ కూడా అధికమే. దీంతో చీజ్‍ను అధికంగా తింటే జీర్ణానికి ఇబ్బందిగా మారుతుంది. మలబద్ధకం సమస్య ఎదురయ్యే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా కొంతమందికి లాక్టోస్ సరిగా జీర్ణం అవదు. వారికి మరింత ఇబ్బందిగా మారుతుంది.
చీజ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
చీజ్‍లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో ఇది తినడం వల్ల ఎముకల దృఢత్వం మెరుగుపడుతుంది. నోటి ఆరోగ్యానికి కూడా చీజ్ మేలు చేస్తుంది. నీటిలో క్రిములు తగ్గేలా చేయగలదు. చీజ్‍లో ఉండే ప్రోటీన్ వల్ల కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. పరిమిత మేర తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉండేందుకు కూడా సాయపడుతుంది.
టాపిక్