Talliki Vandanam Updates: తల్లికి వందనంలో లబ్ది పొందాలంటే విద్యార్ధులకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
Talliki Vandanam Updates: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన తల్లికి వందనం పథకంలో లబ్దిదారులకు ఆధార్ ధృవీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు త్వరలో వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Talliki Vandanam Updates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాల ద్వారా డిబిటి, నాన్ డిబిటి స్కీమ్‌లలో అందించే పథకాలకు లబ్దిదారుల ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్ 29 జారీ చేసింది.
ఏపీలో గత ఐదేళ్లుగా అమ్మఒడి పేరుతో పాఠశాలకు వెళ్లే పేద విద్యార్ధుల తల్లులకు నగదు అందిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులైనా ఇంట్లో ఒకరికి ఈ పథకం ద్వారా ఏటా రూ.15వేలు చెల్లించేవారు. నాలుగేళ్ల పాటు అమ్మఒడి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది.
దీంతో పాటు విద్యార్ధులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు, బూట్లు వంటివి అందించేవారు. అమ్మఒడి నగదును బిపిఎల్ వర్గాలకు అందించగా జగనన్న విద్యా కానుకను మాత్రం అందరికి ఇచ్చేవారు. ఈ క్రమంలో జగనన్న విద్యా కానుక కిట్లలో వందల కోట్లు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన కిట్లకు, విద్యార్ధులకు అందించిన సంఖ్యకు పొంతన లేదనే ఆరోపణలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రతి ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎందరు ఉన్నా ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రతి ఒక్కరికి రూ.15వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29పై సందేహాలు తలెత్తాయి.
ఆధార్ ఆధారంగా అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు జీవోను జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ప్రభుత్వం అందించే నగదు బదిలీ లబ్దితో పాటు స్టూడెంట్ కిట్స్ కూడా ఆధార్ కార్డు ఆధారంగా అందిస్తారు. తల్లికి వందనం విధివిధానాలు త్వరలో ఖరారు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం ఉందని దానిపై దుష్ప్రచారం జరుగుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో చిల్ట్రన్ అని స్పష్టంగా పేర్కొన్నా తల్లికి వందనం పథకాన్ని ఒక్కరికే అమలు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని, తల్లికి వందనం విధివిధానాలు ఖరారు చేయలేదని స్పష్టం చేశారు.
ఆధార్ డేటా అప్డేట్ చేసుకోండి…
ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గత ఐదేళ్లుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. విద్యా కానుక కిట్లను విద్యార్ధుల సంఖ్యను బట్టి ఇచ్చేశారు. ఇకపై ఈ రెండు పథకాలను అందుకోవాలంటే లబ్దిదారులు ఖచ్చితంగా ఆధార్ గుర్తింపు కలిగి ఉండాలి.
ఈ పథకంలో భాగంగా విద్యార్ధులకు ఇంగ్లీష్, తెలుగులో ఉన్న పాఠ్యపుస్తకాలు, నోట్సులు, కుట్టు కూలీతో పాటు మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు,బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా విద్యార్ధులకు అందిస్తారు. పాఠశాలల్లో విద్యార్ధుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీలో ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా అందించే పథకాలను అందుకోవాలంటే ఖచ్చితమైన ఆధార్ డేటా ఆధారంగా వాటిని అమలు చేస్తారు. ప్రతి విద్యార్ధి ఆధార్ సంఖ్యను కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఆధార్ నమోదు చేసుకోని వారు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకు మొబైల్ అనుసంధానించాల్సి ఉంటుంది.
ఎవరికైనా వేలిముద్రలు గుర్తించలేని స్థితిలో ఉంటే కనుపాపల ఆధారంగా వారిని గుర్తిస్తారు. ఇకపై తల్లికి వందనంలో భాగంగా ప్రభుత్వం అందించే ప్రత్యక్ష నగదు బదిలీ అందుకోవాలన్నా, విద్యాకానుకలో భాగంగా కిట్లను తీసుకోవాలన్నా ఆధార్ బయోమెట్రిక్స్ ద్వారా మాత్రమే విద్యార్ధులను గుర్తిస్తారు.
ఇందుకు అనుగుణంగా ఆధార్ బయోమెట్రిక్స్,ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో అమలు చేసే సంక్షేమ పథకాలను ఆధార్ ధృవీకరణ, గుర్తింపు, ఆధార్ ద్వారా జరిగే చెల్లింపుల నియంత్రణ ఆధార్ గుర్తింపు చట్టం 2016కు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.