AP Mlc Elections :ఏపీ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్ట్రోరల్ డ్రాఫ్ట్ జాబితా విడుదల- మీ పేరు ఇలా చెక్ చేసుకోండి
AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గం, జిల్లా, పోలింగ్ బూత్ వివరాలతో ఓటర్ల వివరాలు చెక్ చేసుకోవచ్చు.
ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ విడుదల చేసింది. ఓటు నమోదు ప్రక్రియలో అన్ని పత్రాలు సమర్పించిన వారి పేర్లు లిస్టులో ఉంచారు. ఓటర్లు https://ceoaperolls.ap.gov.inలో నియోజకవర్గం, జిల్లా, పోలింగ్ బూత్ వివరాలు ఎంటర్ చేసి తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
తూ.గో-ప.గో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 18 వరకు నామినేషన్‌కు గడువు ఇచ్చారు. 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.
షెడ్యూల్ ఇలా..
1.నోటిఫికేషన్ జారీ - నవంబర్ 11, 2024
2.నామినేషన్లు వేయడానికి చివరి తేదీ - నవంబర్ 18, 2024
3.నామినేషన్ల పరిశీలన- నవంబర్ 19, 2024
4. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 21 , 2024
5. పోలింగ్ తేదీ- డిసెంబర్ 05, 2024
6. పోలింగ్ సమయం - ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు
7.ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 09, 2024
8. ఎన్నికలు ముగించాల్సిన తేదీ-12 డిసెంబర్, 2024
2025 మార్చి 29తో ఉమ్మడి కృష్ణా- గుంటూరు. తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుంది.
ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నవంబర్ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను విడుదల చేయనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల వైసీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.