Maharashtra CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? దిల్లీకి వెళ్లిన ఫడ్నవీస్.., మరి ఏక్‌నాథ్ షిండే?
Maharashtra Next CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నేతలు ముఖ్యమంత్రి పదవికి అర్హులుగా చెబుతున్నారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఎవరు ఫైనల్ అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ దిల్లీకి వెళ్లారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 288 సీట్లలో 235 స్థానాలను గెలుచుకుంది. తర్వాత మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడం లేదు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తదుపరి ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్నారు. కొందరు అజిత్ పవార్ పేరు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. గత టర్మ్‌లోనూ ఇలాంటి సంకీర్ణ ప్రభుత్వం ఉంది. శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంతకు ముందు 2014 నుంచి 2019 వరకు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు బీజేపీకి 122 సీట్లు వచ్చాయి.
ఇప్పుడు 2024లో బీజేపీకి 132 సీట్లు వచ్చినా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపించినా.. మరోవైపు ఏక్‌నాథ్ షిండే పేరు బలంగా వినిపిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ఫార్ములాపై చర్చ జరగలేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మహాయుతి లడ్కీ బహిన్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిని గెలుచుకున్నాయని అన్నారు.
'ముఖ్యమంత్రి పదవి విషయంలో మిత్రపక్షాల మధ్య ఎలాంటి ఫార్ములా లేదు. దాని గురించి చర్చ జరగలేదు. మూడు మిత్ర పక్షాల నేతలు కూర్చుని చర్చించుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తాం.' అని అజిత్ పవార్ అన్నారు.
'గత టర్మ్ అమలు చేసిన లడ్కీ బహిన్ యోజన మహాయుతి అద్భుతమైన విజయానికి దోహదపడింది. ఈ ఎన్నికల్లో లడ్కీ బహిన్ ప్రాజెక్టును విస్మరించలేం. మహిళా ఓటర్లకు కృతజ్ఞతలు.' అని అజిత్ పవార్ అన్నారు.
మరోవైపు శివసేన ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. శివసేన నాయకుడు రాజు వాఘ్‌మారే మాట్లాడుతూ మహాయుతి కూటమి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఉన్న ప్రజాదరణ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిందని అన్నారు. 'ఏకనాథ్ షిండేకి ఉన్న పాపులారిటీతో 30-40 శాతం ఓట్లు వచ్చాయి. కెప్టెన్‌ని మార్చకూడదు. ఇది మా కోరిక, కానీ మహాయుతి నాయకత్వం ఏది నిర్ణయించినా ఆమోదయోగ్యమైనది.' అని రాజు వాఘ్‌మారే చెప్పారు.
రాష్ట్రంలో మహాయుతి తదుపరి సీఎం పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసేందుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిల్లీ చేరుకున్నారు. సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందా అనే ఆసక్తిగా మారింది.