Cancer: ఆ ప్రదేశంలో దురద రావడం కూడా క్యాన్సర్‌కు సంకేతమేనట, జాగ్రత్త పడండి-itchy armpits are also a sign of cancer so be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer: ఆ ప్రదేశంలో దురద రావడం కూడా క్యాన్సర్‌కు సంకేతమేనట, జాగ్రత్త పడండి

Cancer: ఆ ప్రదేశంలో దురద రావడం కూడా క్యాన్సర్‌కు సంకేతమేనట, జాగ్రత్త పడండి

Haritha Chappa HT Telugu
Nov 25, 2024 07:30 PM IST

Cancer: చర్మంపై చాలాచోట్ల దురదలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ దురదలు క్యాన్సర్‌కు సంకేతాలుగా పనిచేస్తాయి. కొత్తగా కనిపెట్టిన అధ్యయనం ప్రకారం చంకల్లో దురద రావడం కూడా క్యాన్సర్ సంకేతమేనని తెలుస్తుంది.

దురద ఏ క్యాన్సర్ లక్షణం?
దురద ఏ క్యాన్సర్ లక్షణం? (pixabay)

క్యాన్సర్ ప్రపంచంలో ప్రబలిపోతోంది. కంటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్, కాలేయ క్యాన్సర్... ఇలా చెప్పుకుంటే శరీరంలోని అన్ని అవయవాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ సంకేతాలలో కొన్ని తేలికపాటివి కూడా ఉన్నాయి. వాటిని క్యాన్సర్ లక్షణాలుగా కూడా కొంతమంది గుర్తించరు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది దురద పెట్టడం. దురద పెట్టడం అనేది చాలా సాధారణ విషయం. అందుకే శరీరం ఎక్కువగా దురద పెడుతున్నా దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ క్యాన్సర్ ఉందేమోనని అనుమానించరు. అయితే చంకల్లో దురద పెట్టడం అనేది క్యాన్సర్ కు కూడా కారణం కావచ్చని తెలుస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్లలో దురద అనే లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.

లింఫోమా క్యాన్సర్ సోకిన వారిలో దాదాపు 30 శాతం మందికి దురదగా అనిపిస్తుంది. ఇలాంటి దురద వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి దద్దుర్లు కనబడవు. గోకడం వల్ల ఎలాంటి ఉపశమనము కలగదు.

కొన్ని రకాల చర్మ క్యాన్సర్లలో కూడా ఈ దురద అనేది కనిపిస్తుంది. చర్మం మందంగా మారడం, దీర్ఘకాలికంగా అక్కడ మంట, దురద రావడం వంటివి క్యాన్సర్ సంకేతాలే. అలాగే ఆ ప్రాంతంలో ఫలకాలు వంటివి కూడా ఏర్పడతాయి. పొలుసుల్లా ఏర్పడి రాలిపోతూ ఉంటాయి. చిన్న చిన్నద చర్మపు గడ్డలు కూడా ఏర్పడతాయి. అవి ఎరుపు, గులాబీ రంగులో కూడా కనిపిస్తాయి. మొటిమల్లాంటి ఇవి కూడా అక్కడ ఉంటాయి. వీటిని పాపుల్స్ అని అంటారు. ఇలా పాపుల్స్ రావడం కూడా క్యాన్సర్ సంకేతంగానే చెప్పుకోవాలి.

ఇక చంకలో దురద పెడితే అది రొమ్ము క్యాన్సర్ లక్షణంగా భావించాల్సి రావచ్చు. రొమ్ముల్లో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందితే రొమ్ము క్యాన్సర్ వచ్చిందని చెబుతారు. రొమ్ములు మృదువుగా ఎర్రగా, దురద పెడుతున్నట్టు మారుతాయి. అలాగే చంకల్లో దురద కూడా ఎక్కువైపోతుంది. ఏడు నుంచి పది రోజుల్లో ఈ లక్షణాలు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి మామోగ్రామ్ లేదా బ్రెస్ట్ అల్ట్రా సౌండ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి.

కేవలం క్యాన్సర్ వల్లే కాదు చంకలలో దురదకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చెమట ఎక్కువగా పేరుకుపోవడం వల్ల అక్కడ మురికి పట్టి బ్యాక్టీరియా చేరిపోతుంది. అప్పుడు కూడా దురద అధికంగానే ఉంటుంది. అందుకే అండర్ ఆర్మ్స్ ప్రతిసారీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా చర్మవ్యాధి వల్ల కూడా అక్కడ దురద రావచ్చు. కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్లు కూడా మీ చర్మానికి సరిపడక చికాకు పెడుతూ ఉంటాయి. ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల కూడా చంకలలో గాలి తగలక దురద, ఎరుపుదనం వంటివి వస్తాయి. అధిక చెమటలు కూడా దీనికి కారణం కావచ్చు.

రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్ మాత్రమే కాదు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్లకు కూడా దురద ఒక లక్షణంగానే చెప్పుకోవాలి.

Whats_app_banner