Maharashtra CM: మహారాష్ట్రలో ‘‘కిస్సా కుర్చీ కా’’.. సీఎం పీఠం కోసం మహాయుతి నేతల పట్టు; ఫడణవీస్ కే ఎక్కువ అవకాశాలు
Maharashtra election result 2024: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధిస్తోంది. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి పీఠంపై ఈ మూడు పార్టీలు ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది.
Maharashtra CM: మొత్తం 288 స్థానాలకు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల మహాయుతి కూటమి ఘన విజయం దిశగా దూసుకువెళ్తోంది. ఈ కూటమిలో 90 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ తో బీజేపీ ముందంజలో ఉంది. ఈ కూటమిలో బీజేపీ 130 సీట్లలో, శివసేన (షిండే) 57 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) 39 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
ముఖ్యమంత్రి ఎవరు?
మహాయుతి కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో, మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. కూటమిలోని మూడు పార్టీలు తమకే సీఎం పీఠం దక్కాలన్న ఆకాంక్షను ఇప్పటికే వ్యక్త పరిచాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో బహిరంగంగా కనిపించనప్పటికీ, కూటమి పార్టీల మధ్య చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు పార్టీల నేతలు ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతుండటంతో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి.
బీజేపీ వైపు నుంచి దేవేంద్ర ఫడణవీస్
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ వర్గాలు కోరుకుంటున్నాయి. షిండే కోసం గతంలో ఫడణవీస్ సీఎం పదవిని వదులుకున్నారని, ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం అహర్నిషలు కృషి చేశారని, అందువల్ల దేవేంద్ర ఫడణవీస్ కే సీఎం పీఠం దక్కాలని వాదిస్తున్నాయి. కొంతమంది నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ అధినాయకత్వం కూడా దేవేంద్ర ఫడణవీస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
షిండే నే మళ్లీ సీఎం కావాలి..
మరోవైపు శివసేన చీలిక వర్గం నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నే మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని ఆయన వర్గం నాయకులు కోరుకుంటున్నారు. షిండే నాయకత్వంలోనే కూటమి ఎన్నికలకు వెళ్లి, ఘనవిజయం సాధించిందని, ఈ గెలుపునకు షిండే పాలన కూడా కారణమని వారు వాదిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోనే ఎన్నికలు జరిగాయని, అత్యున్నత పదవికి ఆయనే సహజ ఎంపిక అని శివసేన ఎమ్మెల్యే సంజయ్ షిర్సత్ పునరుద్ఘాటించారు.
అజిత్ పవార్ కే సీఎం పదవి ఇవ్వాలి
ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ కే ఈ సారి సీఎం పదవి ఇవ్వాలని ఆయన భార్య బహిరంగంగానే డిమాండ్ చేశారు. అజిత్ పవార్ సహకారంతోనే గతంలో షిండే సీఎం అయ్యారని, అందువల్ల ఈ దఫా అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి గా అవకాశం కల్పించాలని ఆమెతో పాటు పవార్ వర్గం నేతలు కోరుతున్నారు. గతంలో, తనకు సీఎం పదవి చేపట్టాలన్న కోరిక ఉందని అజిత్ పవార్ కూడా తన ఆకాంక్షను వ్యక్తపర్చారు. అజిత్ పావర్ వర్గం నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సీఎం పదవి పంచుకుంటారా?
మరోవైపు, ఒకవేళ, సీఎం పదవి విషయంలో కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, ఐదేళ్ల కాలాన్ని మూడు కూటమి పార్టీలు పంచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫడణవీస్, షిండే చెరో రెండేళ్లు, అజిత్ పవార్ కు ఒక సంవత్సరం పదవిని అప్పగించేలా ఒప్పందం కుదురుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. లేదా, ఫడణవీస్, షిండే చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగేలా, అజిత్ పవార్ ఏకైక డెప్యూటీ సీఎంగా ఉండేలా మరో ప్రణాళిక కూడా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్రలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో నమోదైన ఓటింగ్ శాతం 61.1 కన్నా ఇది దాదాపు 5% ఎక్కువ. ఈసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) క్షేత్రస్థాయిలో ఓటర్లను సమీకరించింది.