TG Student Death : నీ ప్రాణం బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతది : బీఆర్ఎస్
TG Student Death : వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఓ విద్యార్థినికి సీరియస్ అవ్వగా.. హైదరాబాద్ నిమ్స్ అస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతూ మృతిచెందింది. విద్యార్థిని మృతిపై మాజీమంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారిందని.. మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా చిన్నారులు చనిపోతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతిచెందడంపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
'మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ను వెంటాడుతది. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ. ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు సీఎం రేవంత్ రెడ్డి. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తున్నది. వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం' అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
'అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ సర్కారు పూర్తి వైఫల్యం చెందింది. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని హరీష్ రావు స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త.. నన్ను ఎంతగానో కలచి వేసింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే' అని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
కేటీఆర్ ఫైర్..
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్.. 28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యత. రాజ్యాంగబద్ధంగా మినహా.. ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదు. ఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో? ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకున్నారో?' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
'మీ బడెబాయ్, చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా. పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉంది. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకునోటు చరిత్ర నీది. కానీ మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ది' అని కేటీఆర్ స్పష్టం చేశారు.