Virat Kohli: భార్యతోనే రావాలా? నేను గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొస్తా.. హెడ్ కోచ్ ముందు విరాట్ కోహ్లీ వింత ప్రతిపాదన
India tour of Australia: ఆస్ట్రేలియా పర్యటనకి భారత క్రికెటర్ల వెంట కేవలం భార్య, పిల్లలకి మాత్రమే అనుమతి ఉండేది. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌ను వెంట తీసుకొస్తానని బీసీసీఐ ముందు ప్రపోజల్.. దాంతో?
ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. మరోసారి కంగారూలపై ఆధిపత్యం చెలాయించాడు. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌లో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ నుంచి గ్యాలరీలో ఉన్న భార్య అనుష్క శర్మకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.
అనుష్క శర్మకి నో పర్మీషన్
సోమవారం పెర్త్ టెస్టు ముగిసిన తర్వాత ఆ కిస్ గురించి భారత్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు సరదాగా చర్చించారు. ఈ క్రమంలో 2014-15లో ఇలానే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో శతకం బాదిన కోహ్లీ.. అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. వాస్తవానికి ఆ టూర్‌కి అనుష్క శర్మకి వెళ్లడానికి తొలుత అనుమతి లేదు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. అప్పటి వరకూ భారత జట్టులోని ఆటగాళ్ల వెంట కేవలం భార్య, పిల్లలకి మాత్రమే అనుమతి ఉండేది. కానీ.. అనుష్క శర్మతో అప్పటికే డేటింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. తన ప్రియురాలిని టూర్‌కి తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతి కోరాడు.
రవిశాస్త్రికి కోహ్లీ రిక్వెస్ట్
కానీ.. బీసీసీఐ నిరాకరించింది. దాంతో అప్పుడు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రికి ఈ విషయం చెప్పిన విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు విరాట్ విదేశీ పర్యటనల్లో అనుష్క ప్రియురాలిగానే వెళ్లింది. 2017లో ఇద్దరూ వివాహం చేసుకోగా.. ఇప్పుడు భార్య హోదాలో పర్యటనలకి వెళ్తోంది.
ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
2014-15 ఘటనని రవిశాస్త్రి గుర్తు చేసుకుంటూ ‘‘నేను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ (2015లో) పెళ్లి చేసుకోలేదు. అప్పుడు అనుష్కతో అతను డేటింగ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్‌కి ముందు నా దగ్గరకు వచ్చి భార్యలను మాత్రమే వెంట తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతిస్తోంది. నేను నా ప్రియురాలిని తీసుకురావచ్చా? అని అడిగాడు. నిరభ్యంతరంగా తీసుకురావచ్చు అని చెప్పాను.
కానీ.. బోర్డు అనుమతించట్లేదు అని కోహ్లీ చెప్పాడు. వెంటనే నేను బోర్డు సభ్యులతో మాట్లాడి ఒప్పించాను. దాంతో విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క కూడా ఆస్ట్రేలియా టూర్‌కి వచ్చింది. ఆ టూర్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో విరాట్ కోహ్లీ 160 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అనుష్క ఆ సిరీస్‌లో మంచి సపోర్ట్‌గా కోహ్లీకి నిలిచింది’’ అని గుర్తు చేసుకున్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మెల్‌బోర్న్ వేదికగానే ఈ ఏడాది కూడా డిసెంబరు 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ జరగనుండగా.. మరోసారి కోహ్లీ సెంచరీ సాధిస్తాడేమో చూడాలి.