IND vs AUS 1st Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే ఎగిరిన భారత్ గెలుపు జెండా..పెర్త్‌లో కంగారూలు కుదేల్-india vs australia highlights 1st test day 4 jasprit bumrah shines as ind thrash aus by 295 runs take in border gavaskar ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 1st Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే ఎగిరిన భారత్ గెలుపు జెండా..పెర్త్‌లో కంగారూలు కుదేల్

IND vs AUS 1st Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే ఎగిరిన భారత్ గెలుపు జెండా..పెర్త్‌లో కంగారూలు కుదేల్

Galeti Rajendra HT Telugu
Nov 25, 2024 01:26 PM IST

India vs Australia 1st Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోణి అదిరిపోయింది. పెర్త్‌ టెస్టులో కంగారూలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది.

పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం (X)

ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే భారత్ జట్టు సగర్వంగా 295 పరుగుల తేడాతో గెలిచి గెలుపు జెండా ఎగురవేసింది. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 534 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్‌ను 238 పరుగులకే టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. దాంతో ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది.

టాప్-4 బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే

పెర్త్ లాంటి పిచ్‌పై 534 పరుగుల లక్ష్యఛేదన అసాధ్యం. అయితే.. ఆస్ట్రేలియా కనీసం మ్యాచ్ డ్రా కోసమైనా పోరాడుతుందని అంతా ఊహించారు. కానీ.. భారత్ బౌలర్ల ముందే ఆస్ట్రేలియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ (0), ఉస్మాన్ ఖవాజా (4) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన నైట్‌ వాచ్‌మెన్ పాట్ కమిన్స్ (2), మార్కస్ లబుషేన్ (3)‌ కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా చేరుకోలేకపోయారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ 17/4తో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

చిగురించిన ఆస్ట్రేలియా డ్రా ఆశలు

ఈ దశలో ట్రావిస్ హెడ్ (89: 101 బంతుల్లో 8x4), మిచెల్ మార్ష్ (47: 67 బంతుల్లో 3x4, 2x6) ఆ జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడితో ఆస్ట్రేలియా డ్రా ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ.. ట్రావిస్ హెడ్‌ను బుమ్రా చేసేయగా.. మిచెల్ మార్ష్‌ను నితీశ్ రెడ్డి బోల్తా కొట్టించాడు.

ఇక ఆఖర్లో అలెక్స్ క్యారీ (36), మిచెల్ స్టార్క్ (12), నాథన్ లయన్ (0) జోష్ హేజిల్‌వుడ్ (4) కాసేపు క్రీజులో నిలిచినా.. వారి ఆరాటం ఆస్ట్రేలియా టీమ్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు.. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.

సెంచరీలతో భారత్ విజయానికి బాటలు

గత శుక్రవారం ప్రారంభమైన ఈటెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.4 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులే కుప్పకూలిపోయింది. దాంతో భారత్ జట్టుకి 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ (161), విరాట్ కోహ్లీ (100 నాటౌట్) సెంచరీలు బాదేశారు. దెబ్బకి రెండో ఇన్నింగ్స్‌ను 487/6తో డిక్లేర్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 46 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 534 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ముందు నిలిపింది. కానీ.. ఛేదనలో ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌటైపోయింది.

వెటకారపు మాటలకి గెలుపు సమాధానం

భారత్ గడ్డపై ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడిన టీమిండియా.. 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుకి కనీసం పోటీనైనా భారత్ ఇస్తుందా? అనే వెటకారపు మాటలు చాలా వినిపించాయి. అయితే.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది.

Whats_app_banner