IPL Auction Rahane: పృథ్వీ షా, రహానేకు బిగ్ షాక్ - ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టీమిండియా క్రికెటర్లు!
IPL Auction Rahane: ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లు అజింక్య రహానే, పృథ్వీ షా అమ్ముడుపోలేదు. వారితో పాటు శార్ధూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్‌లను కొనేందుకు ఏ ఫ్రాంఛైజ్ ముందుకు రాలేదు.
IPL Auction Rahane: తొలిరోజు ఐపీఎల్ వేలంలో టీమిండియా క్రికెటర్లు కోట్ల ధర పలికారు. రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ ఇరవై కోట్లకు అమ్ముడుపోయి రికార్డులు సృష్టించారు. విదేశీ ప్లేయర్ల కంటే టీమిండియా క్రికెటర్లు మొదటి రోజు వేలంలో అదరగొట్టారు.
సీన్ రివర్స్...
రెండో రోజు మాత్రం సీన్ రివర్సైంది. టీమిండియా క్రికెటర్లను ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు పెద్దగా పట్టించుకోలేదు. పృథ్వీషా, అంజిక్య రహానే, శార్ధూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్‌తో పాటు తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ వేలంలో అమ్ముడుపోలేదు.
రెండు కోట్ల బేస్ ధర...
శార్ధూల్ ఠాకూర్ రెండు కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కోటి, అజింక్య రహానే కోటిన్నర బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టారు. పృథ్వీ షా, శ్రీకర్ భరత్ 75 లక్షలతో ఎంట్రీ ఇచ్చారు. వీరిని కొనేందుకు ఏ ఫ్రాంఛైజ్ ఆసక్తిని చూపకపోవడంతో అన్‌సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.
గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రహానే బరిలో దిగాడు. పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. చెన్నై తరఫున ఆడిన ఠాకూర్ 2024 సీజన్‌లో 21 పరుగులు, ఐదు వికెట్లు మాత్రమే తీశాడు.
టెస్టు ప్లేయర్లుగా ముద్ర...
నిలకడ లేమి, టెస్టు ప్లేయర్లుగా ముద్రపడటం, టీ20 ఫార్మెట్‌కు తగ్గట్లుగా మెరుపు మెరిపించే సత్తా లేకపోవడంతోనే వేలంలో ఈ టీమిండియా క్రికెటర్లు అమ్ముడుపోలేదని సమాచారం.
రెండోరోజు వేలంలో వారికి మరో అవకాశం ఉండనుంది. అప్పుడైనా వీరు అమ్ముడుపోతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
కేన్ విలియమ్సన్‌కు నిరాశ...
పృథ్వీ షాతో పాటు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ మెగా వేలంలో చుక్కెదురైంది. రెండు కోట్ల బేస్ ధరకు కూడా అతడిని ఏ ఫ్రాంఛైజ్ కొనడానికి ముందుకు రాలేదు. విలియమ్సన్‌తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్లు గ్లెన్ ఫిలిప్స్, డారీ మిచెల్ కూడా అన్‌సోల్డ్ ప్లేయర్లుగా నిలిచారు. వీరితో పాటు ఆస్ట్రేలియన్ కీపర్ అలెక్స్ క్యారీ, వెస్టిండీస్ హిట్టర్ షై హోప్‌లకు వేలంలో నిరాశే ఎదురైంది.