AUS vs PAK T20 Highlights: ఆఖరి టీ20లోనూ తేలిపోయిన పాకిస్థాన్, క్లీన్‌స్వీప్ చేసేసిన ఆస్ట్రేలియా
Australia vs Pakistan: పాకిస్థాన్ చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో పాక్‌ను 3-0 తేడాతో చిత్తు చేసేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్థాన్ పర్యటన ఓటమితో ముగిసింది. హోబర్ట్ వేదికగా సోమవారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించేసిన ఆస్ట్రేలియా టీమ్.. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. ఆస్ట్రేలియా జట్టుతో నవంబరు 22 నుంచి భారత్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనున్న విషయం తెలిసిందే.
వన్డేలో పాక్ గెలిచినా.. టీ20ల్లో ఫట్
ఆస్ట్రేలియా గడ్డపై నవంబరు 4 నుంచి పాకిస్థాన్ పర్యటిస్తోంది. తొలుత జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచిన పాకిస్థాన్ టీమ్.. టీ20ల్లో మాత్రం తేలిపోయింది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా కంగారూలకి గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. సోమవారం జరిగిన ఆఖరి టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 117 పరుగులే చేయగా.. ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించేసింది.
పరువు నిలిపిన బాబర్
పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఈరోజు మూడో టీ20లో ఆ జట్టు పరువు నిలిపాడు. 28 బంతులు ఎదుర్కొన్న బాబర్ 4 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. పాక్ టీమ్‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోగా.. బాబర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో అరోన్ హార్డీ 3 వికెట్ల, జంపా, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు తీశారు. దాంతో పాక్ 18.1 ఓవర్లలోనే 117 పరుగులకి ఆలౌటైపోయింది.
స్టాయినిస్ బౌండరీల మోత
118 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ షార్ట్ (2), జాక్ ప్రాసర్ గర్క్ (18) తక్కువ స్కోరుకే ఔటైపోయినా.. నెం.4లో వచ్చిన మార్కస్ స్టాయినిస్ 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది అజేయంగా 61 పరుగులు చేశాడు. దాంతో 11.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా గెలిచేసింది. పాక్ జట్టులో టాప్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకోగా.. హారీస్ రౌఫ్, అబ్బాస్ అఫ్రిది కూడా ఓవర్‌కి 10 పరుగుల చొప్పున ఇచ్చేశారు.