Aadhaar card: ‘‘ఆధార్ కార్డు వయస్సును రుజువు చేసే డాక్యుమెంట్ కాదు’’- హైకోర్టు
Aadhaar card: ఆధార్ కార్డుకు సంబంధించి న్యాయ వ్యవస్థ మరో వివరణ ఇచ్చింది. ఆధార్ కార్డును వయస్సును రుజువు చేసే డాక్యుమెంట్ గా పరిగణించబోమని, అది కేవలం ఐడెంటిటీ డాక్యుమెంట్ మాత్రమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2023 నాటి యూఐడీఏఐ సర్క్యులర్ ను హైకోర్టు ఉదహరించింది.
Aadhaar card: ఆధార్ వయస్సును రుజువు పరిచే పత్రం కాదని, అది కేవలం ఒక గుర్తింపు పత్రం అని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులందరికీ తెలియజేయాలని ఆదేశించింది. విద్యుదాఘాతంతో మృతి చెందిన భర్తకు పరిహారం మంజూరు చేయడానికి ఆధార్ కార్డులో నమోదు చేసిన తన భర్త వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఓ వితంతువు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
పరిహారం పొందడానికిి..
జన్ కల్యాణ్ (సంబల్) యోజన, 2018 కింద ఆర్థిక సహాయం కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని, అయితే ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, ఇతర పత్రాల ప్రకారం తన భర్త వయస్సు 64 ఏళ్లు దాటినందున తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని పిటిషన్ లో పేర్కొన్నారు. నర్సింగ్పూర్ జిల్లా సింగ్పూర్ పంచాయతీకి చెందిన సునీతా బాయి సాహు ఆధార్ కార్డులోని వయస్సును పరిగణనలోకి తీసుకుంటే పరిహారం పొందడానికి అర్హత ఉంటుందని వివరించింది. ఆధార్ ప్రకారం తన భర్త వయసును పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి కోర్టును కోరారు.
సుప్రీంకోర్టు కూడా..
అయితే ఆధార్ కార్డు వయసుకు సంబంధించిన డాక్యుమెంట్ కాదని 2024 అక్టోబర్ 24న సుప్రీంకోర్టు (supreme court) తీర్పు ఇచ్చిందని జస్టిస్ అహ్లువాలియా గుర్తు చేశారు. ఈ ఉత్తర్వులను జారీ చేసేటప్పుడు వివిధ హైకోర్టులు జారీ చేసిన పలు వేర్వేరు ఉత్తర్వులను, ఆధార్ కార్డు హోల్డర్ వయస్సు రుజువు కాదని స్పష్టం చేస్తూ జారీ చేసిన సర్క్యులర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. 2023 ఆగస్టులో జారీ చేసిన సర్క్యులర్ లో యూఐడీఏఐ (UIDAI) కూడా.. ఆధార్ కార్డును గుర్తింపును నిర్ధారించడానికి ఉపయోగించవచ్చని, ఇది పుట్టిన తేదీ రుజువు కాదని స్పష్టం చేసింది. ‘‘ఆధార్ కార్డు (aadhaar) వయస్సుకు సంబంధించిన పత్రం కాదని గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టుతో సహా వివిధ హైకోర్టులు అభిప్రాయపడ్డాయి’’ అని కోర్టు పేర్కొంది, ఆధార్ కార్డు వయస్సు పత్రం కాదని, కేవలం గుర్తింపు పత్రం మాత్రమే అని సంబంధిత అధికారులందరికీ తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.