IND vs AUS Fight: బౌలర్ సిరాజ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ లబుషేన్ గొడవ.. కోపంతో బెయిల్స్ ఎగరగొట్టిన విరాట్ కోహ్లీ
IND vs AUS 1st Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలిరోజే భారత్, ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. లబుషేన్ రనౌట్ నుంచి తప్పించుకోవడానికి బ్యాట్‌తో బంతిని దూరంగా నెట్టడం విరాట్ కోహ్లీకి కోపం తెప్పించింది. దాంతో..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య రెండు సందర్భాల్లో వాగ్వాదం జరిగింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 150 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్ ఈరోజు ఆట ముగిసే సమయానికి 67/7తో నిలిచింది. ఆస్ట్రేలియా టీమ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు వెనకబడి ఉంది.
1952 తర్వాత ఫస్ట్ టైమ్
ఓవరాల్‌గా పెర్త్ టెస్టులో తొలి రోజే 17 వికెట్లు పడగా.. 1952 తర్వాత ఆస్ట్రేలియాలో తొలి రోజు ఇలా అత్యధిక వికెట్లు పడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో వికెట్లే కాదు.. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది.
భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్పిన్నర్ నాథన్ లియాన్, రిషబ్ పంత్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మార్నస్ లబుషేన్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సిరాజ్ vs లబుషేన్ గొడవ
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బంతిని ప్లిక్ చేసేందుకు లబుషేన్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి దొరకని బంతి ఫ్యాడ్‌ను తాకి షార్ట్ లెగ్ వైపుగా వెళ్లింది. దాంతో లబుషేన్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. బంతి క్రీజుకి అత్యంత సమీపంలో ఉండటంతో రనౌట్ కోసం బౌలర్ సిరాజ్ పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
బంతి కోసం సిరాజ్ రావడాన్ని గమనించిన లబుషేన్ మళ్లీ వెనక్కి క్రీజులోకి వెళ్లిపోతూ.. అక్కడే ఉన్న బంతిని బ్యాట్‌తో దూరంగా నెట్టాడు. దాంతో అప్పటికే బంతి దగ్గరకు వచ్చిన సిరాజ్.. బంతిని అలా లబుషేన్ నెట్టడంతో ఆశ్చర్యపోయాడు. రనౌట్ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో లబుషేన్ అలా చేశాడని భావించిన విరాట్ కోహ్లీ.. ఔట్ కోసం అప్పీల్ చేశాడు.
క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయి?
శరీరం లేదా బ్యాట్‌ను తాకిన తర్వాత బంతి స్టంప్స్ దిశగా వెళ్తుంటే బ్యాట్ లేదా కాలుతో ఆపవచ్చనేది క్రికెట్‌లో రూల్. ఆ నిబంధనలకి లోబడే లబుషేన్ అలా బ్యాట్‌తో దూరం నెట్టాడు. ఒకవేళ సిరాజ్‌తో బంతి కాంటాక్ట్ అయిన అలా బ్యాట్‌తో అడ్డుకుని ఉంటే.. అది తప్పిదం అయ్యేది. లబుషేన్ చేసిన పనిపై అంపైర్లకి కోహ్లీ, సిరాజ్ ఫిర్యాదు చేసినా.. అంపైర్ పట్టించుకోలేదు.
సహనం కోల్పోయిన కోహ్లీ
అంపైర్ తీరుపై కోప్పడిన కోహ్లీ.. బంతిని తీసుకుని కావాలనే వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. ఈ క్రమంలో సిరాజ్, లబుషేన్ మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 52 బంతులాడిన లబుషేన్ 2 పరుగులు మాత్రమే చేసి ఆఖరికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే.. అంతకముందే లబుషేన్ క్యాచ్‌ను స్లిప్‌లో విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు.