TG Residential Schools : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
TG Residential Schools : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 28 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. మరో 26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
26 నియోజకవర్గాలు..
బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జున సాగర్, తాండూరు, మక్తల్, రామగుండం, నారాయణ్ పేట, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవేళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల, ధర్మపురి, మెదక్, మేడ్చల్, ఆర్మూరు నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు అయ్యాయి.
అక్టోబర్ 11న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే రోజు మొదటి విడతలో మంజూరైన 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా.. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ప్రత్యేకతలు..
తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో.. ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుకోనున్నారు. వీటిల్లో వేర్వేరు బ్లాక్‌లు ఉంటాయి. ప్రతి స్కూల్లో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, కంప్యూటర్ సెంటర్‌లో 60 కంప్యూటర్లు ఉంటాయి. అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి.
ఈ ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో 25 ఏళ్ల కిందటి నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడిగాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాల్ని ఆర్కిటెక్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. వాతావరణ అనుకూల భవనాలను డిజైన్ చేసింది. ప్రతి డార్మిటరీ గదిలో 10 బెడ్‌లు, రెండు బాత్‌రూములు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
ప్రతి క్యాంపస్‌లో తరగతి గదులు, ల్యాబొరేటరీలు కాకుండా.. కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్‌బాల్ మైదానాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, ఔట్‌డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్‌స్కేప్ కోర్టులు వంటి అధునాతన సౌకర్యాలు ఉండనున్నాయి.
మొదటి విడతలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంథని, పాలేరు, వరంగల్, అందోలు, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ నిర్మించనున్నారు.