Gautam Adani : గౌతమ్​ అదానీని అరెస్ట్​ చేస్తారా? 20ఏళ్ల జైలు శిక్ష తప్పదా? నెక్ట్స్​ ఏం జరుగుతుంది?-what next for billionaire gautam adani charged with bribery in us ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gautam Adani : గౌతమ్​ అదానీని అరెస్ట్​ చేస్తారా? 20ఏళ్ల జైలు శిక్ష తప్పదా? నెక్ట్స్​ ఏం జరుగుతుంది?

Gautam Adani : గౌతమ్​ అదానీని అరెస్ట్​ చేస్తారా? 20ఏళ్ల జైలు శిక్ష తప్పదా? నెక్ట్స్​ ఏం జరుగుతుంది?

Sharath Chitturi HT Telugu
Nov 22, 2024 07:19 AM IST

Gautam Adani latest news : బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు పడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

గౌతమ్​ అదానీని అరెస్ట్​ చేస్తారా?
గౌతమ్​ అదానీని అరెస్ట్​ చేస్తారా? (AFP file)

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. భారతదేశ అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టులు పొందడానికి భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అమెరికాలో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అసలు ఏంటి ఆరోపణలు? గౌతమ్​ అదానీని అరెస్ట్​ చేస్తారా? నెక్ట్స్​ ఏం జరుగుతుంది? భారతీయ బిలియనీర్ ముందు ఏముందంటే..

అసలు ఆరోపణలు ఏంటి?

గౌతమ్ అదానీపై విదేశీ లంచం, సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్ కుట్ర, సంబంధిత అభియోగాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల్లో 2 బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అదానీ 250 మిలియన్ డాలర్లకు పైగా లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. సంబంధిత కంపెనీలు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు వారిపై లంచం ఆరోపణలు వస్తే, వాటిపై అభియోగాలు వేసేందుకు అమెరికా చట్టాలు అనుమతిస్తాయి.

గౌతమ్ అదానీని అమెరికాలో అరెస్ట్​ చేస్తారా?

ఒకవేళ గౌతమ్ అదానీ భారత్​లో ఉంటే.. అయన్ని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు కోరాల్సి ఉంటుంది. భారత న్యాయస్థానాలు భారతీయ చట్టం ప్రకారం.. సంబంధిత అభియోగాలు వర్తిస్తాయో లేదో అంచనా వేస్తాయి. ఏదైనా రాజకీయ లేదా మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేస్తాయి.

తనపై వచ్చిన అభియోగాలను గౌతమ్ అదానీ సవాలు కూడా చేసుకోవచ్చు. ఫలితంగా అప్పగింతపై విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది.

నెక్ట్స్​ ఏంటి?

అమెరికా కోర్టు ఎదుట హాజరుకాలేదు కాబట్టి గౌతమ్ అదానీ ఇంకా తన పిటిషన్ దాఖలు చేయలేదని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఆయన్ని అమెరికా పోలీసులు అరెస్ట్​ చేసినా లేదా ఆయనే లొంగిపోయినా.. ఆ తర్వాత అదానీ తరఫు న్యాయవాదులు అభియోగాలను సవాలు చేయవచ్చు. ప్రాసిక్యూటర్లు అంగీకరించాల్సిన బాధ్యత లేనప్పటికీ ఇరు పార్టీల మధ్య పిటిషన్ డీల్ గురించి కూడా చర్చలు జరగొవచ్చు.

ఏదేమైనా ఈ పూర్తి వ్యవహారంపై త్వరలోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదు! సాక్ష్యాధారాల సవాళ్లు, అదానీ సహ ప్రతివాదులకు ప్రత్యేక విచారణలతో సహా చట్టపరమైన చర్యలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయని రాయిటర్స్ నివేదించింది.

నేరం రుజువైతే ఏమవుతుంది?

నేరం రుజువైతే అదానీకి లంచం ఇచ్చినందుకు ఐదేళ్లు.. మోసం, కుట్ర అభియోగాల కింద 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయనకి గణనీయమైన జరిమానాలు కూడా పడే అవకాశం ఉంది. ఏ శిక్ష అయినా అంతిమంగా ప్రిసైడింగ్ జడ్జిపై ఆధారపడి ఉంటుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది.

ఏ శిక్ష విధించినా అదానీ లీగల్ టీమ్​ అపీల్ చేసుకోవచ్చు. ఇది సుదీర్ఘ న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉంది.

ఆరోపణలపై అదానీ స్పందన ఏంటి?

లంచం ఇచ్చి పని చేయించుకున్నారని వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అవి "నిరాధారమైనవి" అని, అన్ని చట్టాలకు కట్టుబడే పని చేస్తున్నామని పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం