Nandigam Suresh Case : మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసులో కీలక పరిణామం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
Nandigam Suresh Case : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రతివాది ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
మరియమ్మ హత్య కేసులో బెయిల్ నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. నందిగం సురేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
నందిగం సురేష్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసని, ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరని వాదించారు. దర్యాప్తు అధికారి అనుకూలంగా (ఫేవర్) చేశారని స్థానిక న్యాయమూర్తి ఎలా చెబుతారని అన్నారు. 2020లో రాయి తగిలి మృతి చెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి, సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారని సిబల్ వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోందని ధర్మాసనానికి వివరించారు. ఇతర కేసులను కూడా పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు.
వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. నందిగం సురేష్ భార్య బేబిలత మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం తమపైన అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్టు చేశారని చెప్పారు.
న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, న్యాయ పోరాటం చేస్తామని బేబిలత స్పష్టం చేశారు. న్యాయ పోరాటంలో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉన్నారని చెప్పారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)