TG Phone Tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఎయిర్‌టెల్ నుంచి కీలక రిపోర్ట్
TG Phone Tapping case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రెండు నెంబర్లను మాజీ ఎమ్మెల్యే లింగయ్య ట్యాప్ చేయించారు. ఈ రెండు నెంబర్లను తిరుపతన్న, భుజంగరావు ట్యాప్ చేశారు. మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఎయిర్‌టెల్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ కీలకంగా మారింది.
మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్.. వేముల వీరేశం అనుచరులు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయటపడడంతో పోలీసులు విచారణకు పిలిచారు. చిరుమర్తి లింగయ్య, మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ను పోలీసులు విచారణకు పిలిచారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చిరుమర్తి లింగయ్య రానున్నారు. లింగయ్యను ఏసీపీ వెంకటగిరి విచారించనున్నారు.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ నేతలు.. అప్పట్లో వ్యవహరించిన తీరుపై విచారణ జరిపే అవకాశం ఉంది. నాటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. నోటీసుల విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాత మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
రూ.7 కోట్ల తరలింపు..
మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఓ పార్టీ తరఫున రూ.7 కోట్లను తరలించినట్లు ఫోన్ అక్రమ ట్యాపింగ్ దర్యాప్తులో వెల్లడైంది. ఆ డబ్బును ఓ పోలీస్ ఉన్నతాధికారి స్వయంగా ఎస్కార్ట్ ఇచ్చి పంపించినట్లు గుర్తించారు. సొమ్మును తరలించిన సమయంలో ఎస్కార్ట్‌గా వెళ్లిన క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది నుంచి ఇప్పటికే వాంగ్మూలం సేకరించారు. ఈ నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
దీని వెనక కేటీఆర్..
లగచర్ల ఘటనపై టిపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం తప్పు అన్నారు.. లగచర్ల ఫార్మా విషయంలోనూ విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. లగచర్ల ఘటన వెనుక కుట్ర ఉందన్న మహేష్‌గౌడ్.. లగచర్ల ఘటన వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.