Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చు 470 కోట్లు - హాకీ టీమ్ కోసమే 42 కోట్లు!
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో బరిలో దిగుతోన్న అథ్లెట్ల ట్రైనింగ్ కోసం భారత ప్రభుత్వం దాదాపు 470 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. హాకీ టీమ్ కోసమే 42 కోట్లు కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం (నేటి) నుంచి మొదలుకానున్నాయి. ఈ విశ్వ క్రీడల్లో ఇండియా నుంచి 16 ఈవెంట్స్‌లో 117 మంది అథ్లెట్లు పోటీపడుతోన్నారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే తక్కువ మంది ఈ సారి క్వాలిఫై అయ్యారు.
ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 32 ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతోండగా ఇండియా కేవలం 16 గేమ్స్‌కు మాత్రమే అర్హత సాధించింది. భారత ఈవెంట్స్ శనివారం నుంచి మొదలుకానున్నాయి. బ్యాడ్మింటన్ పోటీలతో ఒలింపిక్స్‌లో తమ పతకాల వేటను కొనసాగించబోతున్నది.
470 కోట్లు ఖర్చు...
కాగా ఒలింపిక్స్ సన్నద్ధమవ్వడానికి అథ్లెట్ల శిక్షణ కోసం భారత ప్రభుత్వం ఏకంగా 470 కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. కేవలం హాకీ టీమ్ శిక్షణ కోసం 42 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. గత నెల రోజులగా భారత హాకీ టీమ్ బెంగళూరులో ఒలింపిక్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నది. గత ఒలింపిక్స్‌లో హాకీ టీమ్ కాంస్య పతకం గెలిచింది. ఈ సారి గోల్డ్ మెడల్‌పై హర్మన్‌ప్రీత్ సింగ్ సేన గురిపెట్టింది.
నీరజ్ చోప్రా...
పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఎక్కువ ఆశలు ఉన్న అథ్లెట్లలో నీరజ్ చోప్రా ఒకరు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి చరిత్రను సృష్టించారు. ఈ సారి కూడా గోల్డ్ మెడల్‌పై కన్నేశాడు. ఒలింపిక్స్ కోసం యూరప్‌లో నీరజ్ చోప్రా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు చెబుతోన్నారు. అతడి ట్రైనింగ్‌కు 5.72 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.
బ్యాడ్మింటన్ డబుల్స్...
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో బరిలో దిగుతోన్న చిరాగ్‌శెట్టి, సాత్విక్ రాజ్ ఒలింపిక్స్ ట్రైనింగ్ కోసం ఒలింపిక్ అసోసియేషన్ భారీగా ఖర్చు చేసింది. వీరి శిక్షణ కోసం సుమారు ఆరు కోట్ల వరకు వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
సింగిల్స్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోసం మూడు కోట్లు, వెయిల్ లిఫ్టర్ మీరాబాయి ఛాను కోసం 2.74 కోట్ల వరకు ఒలింపిక్ అసోసియేషన్ డబ్బులు కేటాయించినట్లు సమాచారం. షూటర్లు మను బాకర్, సిప్ట్ కౌర్ సమరతో పాటు మిగిలియర్లు అథ్లెట్లకు కలిపి ఐదు కోట్లకుపైనే ఖర్చు చేసినట్లు తెలిసింది. అతి తక్కువగా రెజ్లింగ్ క్రీడాకారుల ట్రైనింగ్‌ను డబ్బును కేటాయించినట్లు చెబుతోన్నారు.
గోల్డ్ గెలిస్తే కోటి రూపాయలు...
కాగా ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన క్రీడాకారులకు భారత ప్రభుత్వం భారీగా ప్రైజ్‌మనీ అనౌన్స్ చేసింది. గోల్డ్ మెడల్ గెలిస్తే కోటి, సిల్వర్ మెడల్‌కు 75 లక్షలు, బ్రాండ్ మెడల్ అయితే యాభై లక్షలు ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రైజ్‌మనీతో పాటు గతంలో రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా ఒలింపిక్స్ విజేతలకు నగదు బహుమతులను అందజేశాయి.