Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు.. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామన్న హైదరాబాద్ పోలీసులు
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ పోలీసులకు ఎంఐఎం కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఓల్డ్ సిటీ వాసులను అవమానించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని కంప్లైంట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పవన్‌పై ఏఐఎంఎం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారని అవమానించినందుకు.. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయాలని ఎంఐఎం నాయకుడు ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అని సమాధానం ఇచ్చారు.
ఎన్టీయే కూటమి తరఫున పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 'మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను పారదోలి, ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలి. మహారాష్ట్ర చరిత్రలో ఎందరో మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడారి. వారి ఆశయాలకు దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి' అని పవన్ కళ్యాణ్ కోరారు.
పవన్ కళ్యాణ్ నాందేడ్ జిల్లా పాలజ్, దెగ్లూరులలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. లాతూర్‌లో రోడ్ షో నిర్వహించారు. 'పదేళ్ల ఎన్డీయే పాలనలో ప్రపంచ పటంపై తిరంగ జెండా రెపరెపలాడుతోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. నాగ్‌పుర్ నుంచి ఠాణె వరకు నిర్మించిన సమృద్ధి మహా మార్గం నవనిర్మాణానికి బాటలు వేసింది' అని పవన్ వ్యాఖ్యానించారు.
'సమర్థ పాలన, స్థిరత్వం ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ సూపర్‌స్టార్స్‌గా ఎదిగారు. అబ్దుల్‌కలాంను గుండెల్లో పెట్టుకున్న దేశమిది. ఇలాంటివి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కనిపించవు. ఆర్టికల్ 370ని రద్దుచేసి దేశమంతా ఒకటేనని బీజేపీ నిరూపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసింది' అని పవన్ కళ్యాణ్ వివరించారు.
'హైదరాబాద్‌లో కొందరు నేతలు.. పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామంటారు. మనకు అలాంటి ప్రభుత్వాలు వద్దు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా? కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.