India all out: పెర్త్ టెస్టులో నిప్పులు చెరిగిన ఆస్ట్రేలియా బౌలర్లు.. 150కే కుప్పకూలిపోయిన టీమిండియా-india 150 all out against australia in ind vs aus 1st test match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India All Out: పెర్త్ టెస్టులో నిప్పులు చెరిగిన ఆస్ట్రేలియా బౌలర్లు.. 150కే కుప్పకూలిపోయిన టీమిండియా

India all out: పెర్త్ టెస్టులో నిప్పులు చెరిగిన ఆస్ట్రేలియా బౌలర్లు.. 150కే కుప్పకూలిపోయిన టీమిండియా

Galeti Rajendra HT Telugu
Nov 22, 2024 01:13 PM IST

IND vs AUS 1st Test Match: పెర్త్ టెస్టులో కనీసం రెండు సెషన్లని కూడా భారత్ జట్టు ఈరోజు పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయింది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టీమిండియా పరువు నిలిపాడు.

పెర్త్ టెస్టులో భారత్ 150కే ఆలౌట్
పెర్త్ టెస్టులో భారత్ 150కే ఆలౌట్ (AFP)

ఆస్ట్రేలియా టూర్‌ని భారత్ జట్టు అత్యంత పేలవంగా ఆరంభించింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు అత్యంత పేలవంగా 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.

పరువు నిలిపిన తెలుగు క్రికెటర్

ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించిన పెర్త్ పిచ్‌పై కేవలం 49.4 ఓవర్లు మాత్రమే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ చేయగలిగింది. సీనియర్లు లేని వేళ.. తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు పరువు నిలిపాడు. లేదంటే.. 100లోపే భారత్ జట్టు ఆలౌట్ అయిపోయేది.

కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0)‌తో పాటు నెం.3లో ఆడిన దేవదత్ పడిక్కల్ (0), నెం.4లో ఆడిన విరాట్ కోహ్లీ (5) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. ఈ దశలో కేఎల్ రాహుల్ (26: 74 బంతుల్లో 3x4) కాసేపు నిలకడగా ఆడినా.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. అతని ఫ్యాడ్‌కి బ్యాట్ తాకి సౌండ్ రాగా.. అదే సమయంలో బ్యాట్ పక్క నుంచి బంతి వెళ్లడంతో.. థర్డ్ అంపైర్ ఔట్ నిర్ణయం ప్రకటించాడు.

పంత్-నితీశ్ జోడి భాగస్వామ్యం

ఈ దశలో రిషబ్ పంత్ (37: 78 బంతుల్లో 3x4, 1x6) సమయోచితంగా ఆడాడు. కానీ.. అతనికి ధ్రువ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) నుంచి నామమాత్రపు సపోర్ట్ కూడా లభించలేదు. కానీ.. కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విశాఖపట్నంకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి (41) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. వరుస విరామాల్లో రిషబ్ పంత్, నితీశ్ రెడ్డిని ఔట్ చేయడంతో.. భారత్ జట్టు తక్కువ స్కోరుతో సరిపెట్టుకోక తప్పలేదు. పంత్, నితీవ్ జోడి 7వ వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

4 వికెట్లు పడగొట్టిన హేజిల్‌వుడ్

ఆఖర్లో హర్షిత్ రాణా (7), జస్‌ప్రీత్ బుమ్రా (8), దూకుడుగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్లు ఆడారు. కానీ.. బంతి ఆశించిన మేర కనెక్ట్ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు.

Whats_app_banner