IND vs AUS 1st Test Highlights: పెర్త్‌లో తొలి రోజు ముగిసిన ఆట.. బ్యాటర్లు చేతులెత్తేసినా.. భారత్ పరువు నిలిపిన బౌలర్లు
Australia vs India 1st Test Day 1 Highlights: పెర్త్ టెస్టులో భారత్ బ్యాటర్లు ఫెయిలైనా.. ఫాస్ట్ బౌలర్లు పరువు నిలిపారు. మొదటి రెండు సెషన్స్‌లో తేలిపోయిన టీమిండియా.. ఆఖరి సెషన్‌లో దుమ్ముదులిపేసింది. తొలి రోజే మ్యాచ్‌లో 17 వికెట్లు పడటం గమనార్హం.
భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 150 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్ ఈరోజు ఆట ముగిసే సమయానికి 67/7తో నిలిచింది. ఆస్ట్రేలియా టీమ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు వెనకబడి ఉంది.
ఆస్ట్రేలియాని బెంబేలెత్తించిన బుమ్రా
పేసర్లకి అనుకూలించిన పెర్త్ పిచ్‌పై భారత్ జట్టుని 150 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందాన్ని ఆస్ట్రేలియాకి కొన్ని నిమిషాల్లోనే టీమిండియా బౌలర్లు దూరం చేశారు. భారత్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాని వరుస వికెట్లతో భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (8), నాథన్ మెక్‌స్వీనీ (10) వికెట్లను పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. స్టీవ్‌స్మిత్ (0)ని కూడా బోల్తా కొట్టించాడు. దెబ్బకి ఆస్ట్రేలియా టీమ్ 19/3తో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.
లబుషేన్ అడ్డు తొలగించిన సిరాజ్
ఈ దశలో మార్కస్ లబుషేన్ (2: 52) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. చాలా సేపు క్రీజులో నిలిచిన ఈ బ్యాటర్ పరుగులు చేయకుండా కేవలం డిఫెన్స్‌తో సరిపెట్టాడు. అయితే.. అతడ్ని ఔట్ చేసేందుకు మహ్మద్ సిరాజ్‌ను రంగంలోకి దింపిన బుమ్రా ఫలితం రాబట్టాడు.
కొత్త బౌలర్ హర్షిత్ రాణా కూడా ట్రావిస్ హెడ్ (6) ఔట్ చేశాడు. ఆఖర్లో మిచెల్ మార్ష్ (6)ను మహ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించగా.. పాట్ కమిన్స్ (3)ను బుమ్రా ఔట్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ ఈరోజు ఆట ముగిసే సమయానికి ప్రధాన వికెట్లు కోల్పోయి 67/7తో నిలిచింది. భారత్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశాడు.
ఇక క్యారీ ఒకడే అడ్డు
ప్రస్తుతం క్రీజులో ఆస్ట్రేలియా బ్యాటర్లు అలెక్స్ క్యారీ (19 బ్యాటింగ్: 28 బంతుల్లో 3x4), మిచెల్ స్టార్క్ (6 బ్యాటింగ్: 14 బంతుల్లో 1x4) ఉన్నారు. ఇంకా నాథన్ లయన్, జోష్ హేజిల్‌వుడ్ మాత్రమే బ్యాటింగ్ చేయాల్సింది. దాంతో.. శనివారం తొలి సెషన్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాని భారత్ జట్టు ఆలౌట్ చేయగలిగితే.. కనీసం 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అలెక్స్ క్యారీ తప్ప.. మిగిలిన వాళ్లు అంతా బౌలర్లే.
టాప్ స్కోరర్‌గా నితీశ్ రెడ్డి
అంతకముందు భారత్ జట్టు 49.4 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌటైంది. టీమ్‌లో సతీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 5 పరుగులతో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.