OTT Suspense Thriller Movie: ఓటీటీలో వావ్ అనిపిస్తున్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, తెలుగులో ఇక్కడ చూసేయండి-malayalam mystery thriller kishkindha kaandam ott watch in disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Suspense Thriller Movie: ఓటీటీలో వావ్ అనిపిస్తున్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, తెలుగులో ఇక్కడ చూసేయండి

OTT Suspense Thriller Movie: ఓటీటీలో వావ్ అనిపిస్తున్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, తెలుగులో ఇక్కడ చూసేయండి

Galeti Rajendra HT Telugu
Nov 22, 2024 06:56 PM IST

Kishkindha Kaandam OTT: తుపాకీ మిస్సింగ్‌తో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులు తిరుగుతూ చివరికి ఒక క్రైమ్‌ను తెరపైకి తీసుకొస్తుంది. ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న కిష్కింద కాండం మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న కిష్కింద కాండం
ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న కిష్కింద కాండం (Disney+ Hotstar )

సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ఒక మలయాళం సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్ హీరో లేడు.. ఒక పాట లేదు.. ఫైట్ అంతకంటే లేదు. కానీ.. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీలవుతూ సోషల్ మీడియాలో తమ ఒపీనియన్‌ను పోస్ట్ చేస్తున్నారు. అంతలా ప్రేక్షకులకి నచ్చిన ఆ సినిమా పేరు ‘కిష్కింద కాండం’. టైటిల్‌ను చూసి ఇది ఏదో.. కోతులకి సంబంధించిన సినిమా అనుకోకండి.. ఇందులో కోతులు కనిపిస్తాయి. అలానే కోతి శవం కారణంగానే కథ కూడా ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే.. పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.

కథ ఏంటంటే?

అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) తన భార్య చనిపోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అప్పటికే అతని నాలుగేళ్ల కొడుకు చాచూ కూడా కనిపించకుండా పోయి ఉంటాడు. అలానే ఇంట్లోనే ఉండే అతని తండ్రి అ‍ప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటాడు. అయితే.. అప్పు పిళ్లైకి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. రోజువారీ ఘటనల్ని కూడా మర్చిపోతూ ఉంటాడు. దాంతో గజినీలా అన్నీ రాసుకుంటూ ఉంటాడు.

రెండు బుల్లెట్లు మిస్సింగ్

ఎన్నికల సమయం కావడంతో.. అ‍ప్పు పిళ్లై వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీని అప్పగించమని స్థానిక పోలీసులు ఆదేశిస్తారు. కానీ.. అప్పటికే ఆ తుపాకీ కనిపించకుండా పోయి ఉంటుంది. ఆ తుపాకీ ఏమైంది? అందులోని రెండు బుల్లెట్లు ఎలా మాయమయ్యాయి? కోతి చేతిలోకి తుపాకీ ఎలా వెళ్లింది? ఈ ప్రశ్నలతో పాటు అజయ్ చంద్రన్ భార్య ఎలా చనిపోయింది? కొడుకు ఎందుకు కనిపించకుండా పోయాడు? ఇలా ఒక్కో మిస్టరీ ప్రశ్నకి సమాధానం వెతకడమే ఈ సినిమా.

సినిమా ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుడు పూర్తిగా లీనమైపోతాడు. అంతలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు దింజిత్‌ అయ్యతన్‌ కట్టిపడేస్తాడు. సగం కాలిపోయిన పేపర్ ముక్కలతో సస్పెన్స్ వీడటం ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. ఆఖరి 20 నిమిషాలు.. ఒక్కో మిస్టరీ వీడుతుంటే.. నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే కుతూహలం పెరిగిపోతుంది. ఆఖరిగా ఎమోషన్ సీన్స్‌తో కన్నీళ్లు పెట్టించి ఒక పవర్ ఫుల్ డైలాగ్‌తో సినిమాని దర్శకుడు ముగిస్తాడు.

కేవలం రూ.7 కోట్ల బడ్జెట‌్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.75 కోట్ల వరకూ మలయాళంలో వసూళ్లని రాబట్టింది. ఓటీటీలో డిస్నీ + హాట్‌స్టార్‌‌‌లో ఈ కిష్కింద కాండం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి థ్రిల్‌ను ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చూడొచ్చు.

Whats_app_banner