Kawal Tiger Reserve : టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాల తరలింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం-government decided to evacuate villages within kawal tiger reserve ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kawal Tiger Reserve : టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాల తరలింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Kawal Tiger Reserve : టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాల తరలింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Basani Shiva Kumar HT Telugu
Nov 22, 2024 06:54 PM IST

Kawal Tiger Reserve : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాల తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.

కవ్వాల్ టైగర్ రిజర్వ్
కవ్వాల్ టైగర్ రిజర్వ్ (X)

అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులపై మంత్రి కొండా సురేఖ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ.. పునరావాస చర్యలు విజయవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకతను చేకూర్చాయని అభిప్రాయపడ్డారు.

పెరుగుతున్న పులుల ఆహార లభ్యతకు అనుగుణంగా.. జింకల సంఖ్యను పెంచే దిశగా అటవీశాఖ చేపడుతున్న చర్యలపై మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. అక్కమహాదేవి గుహలకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూ, జలమార్గాల్లో యాత్రా సౌకర్యం కల్పించేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నల్లమల అటవీప్రాంతంలో సలేశ్వరం జాతరను భవిష్యత్తులో అటవీశాఖ చేపట్టనున్న సర్క్యూట్‌లలో చేర్చే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని నాలుగు గ్రామాలను పునారావ కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా అటవీ అధికారులు మంత్రి వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల - దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో.. ప్రస్తుతం పర్యాటక సేవలు అందిస్తున్నట్లు మంత్రి సురేఖకు వివరించారు.

సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట- శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్‌లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వన్యప్రాణుల దాడుల్లో మరణించే వారికి పరిహారం రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంపుపై చర్చ జరిగింది. వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని.. రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ‘స్టేట్ లెవల్ కమిటి ఫర్ మిటిగేటింగ్ హ్యూమన్ యానిమల్ కాంఫ్లిక్ట్’తో పూర్తిస్థాయి చర్చల తర్వాత పరిహారం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Whats_app_banner