Dosa Tips: హోటల్ స్టైల్‍లో ఇంట్లో దోశలు క్రిస్పీగా వచ్చేందుకు ముఖ్యమైన టిప్స్.. ఫాలో అవండి!
Dosa Tips: దోశలు ఇంట్లో చేసుకుంటే చాలా మందికి క్రిస్పీగా రావు. మెత్తగా తయారవుతుంటాయి. హోటల్‍లో చేసినట్టు ఉండవు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లో కూడా దోశలను క్రిస్పీగా చేసుకోవచ్చు.
దోశలు అంటే చాలా మందికి ప్రాణం. వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇంట్లో చేసుకుంటే కొంతమందికి దోశలు మెత్తగా వస్తాయి. హోటల్స్, రెస్టారెంట్లలో దోశలు క్రిస్పీగా, మంచి కలర్‌తో ఉంటాయి. ఇంట్లో చేసుకుంటే చాలా మందికి అలా రావు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లో కూడా హోటల్ స్టైల్‍లో క్రిస్పీగా దోశలు తయారు చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.
సరైన నిష్పత్తి
దోశ పిండి తయారు చేసేందుకు మినప్పప్పు, బియ్యం నిష్పత్తి సరిగా ఉండాలి. ఒక కప్పు మినపప్పుకు మూడు కప్పుల బియ్యం వేయాలి. రేషన్ బియ్యం వాడితే బాగుంటుంది. బియ్యం తక్కువగా వేస్తే దోశ అంత క్రిస్పీగా ఉండదు. అందుకే సరైన నిష్పత్తి పాటించాలి. బియ్యం, మినప్పప్పును కనీసం ఆరు గంటలు నానబెట్టాలి. అలాగే, గ్రైండ్ చేసుకున్నాక పిండిని సుమారు 8 గంటల పాటు పులియనివ్వాలి.
అటుకులు వేసుకోవచ్చు
దోశ క్రిస్పీగా రావాలంటే కొన్ని అటుకులు వేసుకోవాలి. మినప్పప్పు, బియ్యం గ్రైండ్ చేసుకునే అరగంట ముందు అటుకులు నీటిలో నానబెట్టుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకునే సమయంలో అటుకులు వేయాలి. అటుకుల వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి.
రవ్వ, శనగపిండి
దోశలు క్రిస్పీగా రావాలంటే దోశ వేసుకునే ముందు దాంట్లో కాస్త ఉప్మా రవ్వ వేసుకోవచ్చు. దీశకు క్రిస్పీనెస్‍ను రవ్వ ఇస్తుంది. దోశ మంచి రంగు రావాలంటే పిండిలో కాస్త శనగ పిండి కూడా వేసుకోవచ్చు. దోశకు మంచి కలర్‌ను శనగ పిండి ఇస్తుంది.
కాస్త మెంతులు
దోశలు గోల్డెన్ కలర్ వచ్చేందుకు మెంతులు ఉపయోగపడతాయి. ఒక్కో కప్ బియ్యానికి ఓ టేబుల్ స్పూన్ మెంతులు వాడాలి. మినప్పప్పు, బియ్యంతో కలిపి మెంతులను కూడా నానబెట్టుకోవచ్చు. లేకపోతే గ్రైండ్ చేసే సమయంలో మెంతుల పేస్ట్ వేయవచ్చు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో మెంతుల మోతాదు ఎక్కువ కాకూడదు. మెంతులు ఎక్కువైతే చేదు వచ్చే అవకాశం ఉంటుంది.
పెనం.. కాల్చుకునే విధానం
దోశలు కాల్చేందుకు నాన్‍స్టిక్ పెనం కంటే కాస్ట్ ఐరన్ పెనం మేలు. ఐరన్ పెనం అయితే వేడి మొత్తానికి విస్తరిస్తుంది. దోశ బాగా కాలేలా చేస్తుంది. పిండి వేసే ముందు పెనం బాగా వేడిగా ఉండాలి. ఆ తర్వాత దోశ పిండి వేయాలి. దోశను పెనంపై రుద్దాక మంటను మీడియంకు తగ్గించుకోవాలి. ఆ తర్వాత దోశ మొత్తం నూనె లేకపోతే నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ పెనం చల్లగా ఉన్నప్పుడు దోశ రుద్దితే మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది.
టాపిక్