Maharashtra results: నవంబర్ 26 లోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.. లేదంటే!-a new government must be formed in maharashtra by november 26 otherwise ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Maharashtra Results: నవంబర్ 26 లోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.. లేదంటే!

Maharashtra results: నవంబర్ 26 లోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.. లేదంటే!

Sudarshan V HT Telugu
Nov 22, 2024 08:00 PM IST

Maharashtra results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది. ఆ లోపు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అలా కాని పక్షంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (PTI)

Maharashtra results: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం, నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి. కాగా, అక్కడ ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 26 తో ముగుస్తుంది. ఆ లోపు, అంటే, 72 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాలి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి గానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమికి గానీ సంపూర్ణ మెజారిటీ వస్తే, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద సమస్య ఎదురు కాదు. కానీ, కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు హంగ్ ఏర్పడితే మాత్రం రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చు.

72 గంటల సమయం

మహారాష్ట్రను రాష్ట్రపతి పాలన నుంచి తప్పించేందుకు పార్టీలకు 72 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడినా, లేదా కూటమి నేతల మధ్య సీఎం పదవిపై గందరగోళం నెలకొన్నా.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి రాకుండా ఉండాలంటే, పార్టీలు వేగంగా పని చేయాల్సి ఉంది. మహాయుతి లేదా మహా వికాస్ అఘాడీ కూటమిలో ఒకదానికి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, ఆ కూటమిలో నేతల మధ్య ముఖ్యమంత్రి పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ ఉంది.

గతంలో కూడా..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర (maharashtra assembly election 2024) లో రాష్ట్రపతి పాలన కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల తర్వాత, 2014 ఎన్నికల తర్వాత అక్కడ స్వల్ప కాలం పాటు రాష్ట్రపతి పాలన విధించారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేస్తున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్‌లు మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.కానీ, నాలుగు ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పాయి. 288 మంది సభ్యులున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి ఏ పార్టీకి లేదా కూటమికి కనీసం 145 సీట్లు రావాలి.

మహాయుతికే అవకాశం

నాలుగు ప్రధాన ఎగ్జిట్ పోల్స్, సి-ఓటర్, పి-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్‌షాహి మరాఠీ-రుద్ర, మహాయుతి లేదా ఎంవిఎ స్పష్టమైన మెజారిటీని సాధించే అవకాశం లేదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో మహాయుతి 112 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, ప్రతిపక్ష ఎంవీఏ 104 సీట్లు గెల్చుకోవచ్చని, 61 సీట్లలో గట్టి పోటీ ఉందని సి-వోటర్ సర్వే పేర్కొంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కావచ్చు.

మెజారిటీ వచ్చినా..

ఒకవేళ, మహాయుతికి గానీ, ఎంవీఏ కు గానీ స్పష్టమైన మెజారిటీ వచ్చినా.. ముఖ్యమంత్రి పదవిపై కొంత గందరగోళం నెలకొనవచ్చు. రెండు కూటములలోనూ సీఎం పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. మహాయుతిలో దేవేంద్ర ఫడణవీస్, ఏక్ నాథ్ షిండే ప్రధానంగా రేసులో ఉండగా, ఎంవీఏ లో ఉద్ధవ్ ఠాక్రే ముందంజలో ఉన్నారు.

Whats_app_banner