Hemant Soren: జార్ఖండ్ సీఎం పదవికి చంపాయ్ సోరెన్ రాజీనామా; మళ్లీ పదవి చేపట్టనున్న హేమంత్ సోరెన్
జార్ఖండ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన హేమంత్ సోరెన్ కు మార్గం సుగమం చేసేందుకు చంపాయ్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు చంపాయ్ సోరెన్ బుధవారం అందజేశారు.
జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధం అయింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి పదవి నుంచి చంపాయ్ సోరెన్ దిగిపోనున్నారు. తన రాజీనామా లేఖను బుధవారం రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు చంపాయ్ సోరెన్ అందజేశారు. జేఎంఎం శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్ ను ఎన్నుకోవాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడంతో తాను జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గవర్నర్ కు రాజీనామా సమర్పించిన అనంతరం చంపాయ్ సోరెన్ తెలిపారు.
మళ్లీ సీఎంగా హేమంత్ సోరెన్
ఐదు నెలల పాటు జైళ్లో గడిపిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించడంతో మరోసారి జార్ఖండ్ సీఎం పదవి చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జార్ఖండ్ లోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నేతలు కూడా హేమంత్ సోరెన్ కు మళ్లీ సీఎం పదవి అందించాలని నిర్ణయించారు. ‘మేము హేమంత్ సోరెన్ ను మా నాయకుడిగా ఎన్నుకున్నాము. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను' అని చంపాయ్ సోరెన్ రాజ్ భవన్ వెలుపల మీడియాతో అన్నారు. తన స్థానంలో హేమంత్ సోరెన్ ను సీఎంగా నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చంపాయ్ సోరెన్ అవమానంగా భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని ఆయన మీడియాతో స్పష్టం చేశారు.
శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కూటమి ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య ఏకాభిప్రాయం తర్వాత హేమంత్ సోరెన్ జూలై 3, బుధవారం శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడానికి ముందు హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన తర్వాత జార్ఖండ్ సీఎం పదవిని 'జార్ఖండ్ టైగర్' చంపాయ్ సోరెన్ స్వీకరించాలని హేమంత్ సోరెన్ నిర్ణయించారు. దాంతో ఫిబ్రవరి 2న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ఎన్నికయ్యారు. ఐదు నెలల తర్వాత హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరై జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు.
టాపిక్