BRS KCR: కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్‌ కీలకం అవుతుందన్న కేసీఆర్, బీజేపీకి 200సీట్లు దాటవని జోశ్యం…-kcr said that brs will be crucial if there is a hung at the centre ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Kcr: కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్‌ కీలకం అవుతుందన్న కేసీఆర్, బీజేపీకి 200సీట్లు దాటవని జోశ్యం…

BRS KCR: కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్‌ కీలకం అవుతుందన్న కేసీఆర్, బీజేపీకి 200సీట్లు దాటవని జోశ్యం…

Sarath chandra.B HT Telugu
Apr 29, 2024 06:36 AM IST

BRS KCR: కేంద్రంలో నరేంద్ర మోదీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదని, తెలంగాణలో 14, 15 సీట్లు గెలిస్తే కేంద్రంలో హంగ్ వస్తే కీలకమైన పాత్ర పోషించేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.

వరంగల్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
వరంగల్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

BRS KCR: గోదావరి, కృష్ణా జలాలను కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు నిధులు రాబట్టుకోవాలన్నా, ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగు పడాలన్నా.. BRS బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలని, అదే తెలంగాణ కు క్షేమం అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్‌కు మద్దతుగా ఆదివారం రాత్రి కేసీఆర్ KCR వరంగల్ Warangal నగరంలో రోడ్డు షో Road Show నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమకొండ Hanmakonda చౌరస్తా వద్ద కేసీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ సీట్లన్నీ గెలిపిస్తే పేగులు తెగేదాకా కొట్లాడుతామన్నారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి, గోదావరి నది జలాలను కర్నాటక, తమిళనాడుకు తరలించే కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నోరు మూసుకుని ఉంటున్నాడని, దాని వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ

బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని, పంచాయితీలు, విద్వేషం తప్ప.. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలుండవని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పాలనలో అచ్చేదిన్ రాలే.. కానీ సచ్చేదిన్ వచ్చిందన్నారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని గుజరాత్ కు తీసుకెళ్లాడని, గిరిజన యూనివర్సిటీ కోసం పదేండ్ల నుంచి కొట్లాడుతుంటే ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చి చేతులు దులుపుకొన్నారన్నారు. దేశంలో 18 లక్షల ఖాళీలు ఉంటే.. ఒక్క ఉద్యోగం కూడా నింపలేదని మండిపడ్డారు.

వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లే రాలేదట

కాళేశ్వరం నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడని, వరంగల్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లే రాలేదంటున్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పాలనలో శ్రీరామ్ సాగర్ స్టేజీ టూ కడితే దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్లు రాలేదని, తెలంగాణ వచ్చిన తరువాత కష్టపడి కాళేశ్వరం నిర్మిస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు చేరాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర, భూగోళం ఏమీ తెల్వదని విమర్శించారు.

కాంగ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోస పోయారని, కరెంట్, సాగునీళ్లు ఎక్కడ బోయాయని, పంటలు ఎందుకు ఎండుతున్నయ్.. మంచినీళ్ల కరువు ఎందుకొస్తున్నది.. గత పదేండ్లలో ఇవన్నీ ఉండేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, హామీల గురించి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గుడ్లు తీసి గోలీలాడుకుంటా.. పేగులు తీసి మెడలో వేసుకుంట.. చెడ్డీ కూడా గుంజుకుంట.. చర్లపల్లి జైలులో వేస్త అంటున్నాడని మండిపడ్డారు.

ఈ జైళ్లు, తోకమట్టలకు కేసీఆర్ భయపడేవాడే కాదని, అలా భయపడితే తెలంగాణ వచ్చేదా..?అని ప్రశ్నించారు. బీజేపీ సర్కారు తన కూతురును జైల్లో వేసిందని, అయినా తాను భయపడలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా భూముల రేట్లు బాగా పెరిగి, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా జరిగిందని, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వేల మంది రోడ్డున పడ్డారన్నారు.

హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో గత ఐదు నెలలుగా బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడం లేదని, స్వ్కేర్ ఫీటుకు ఇంత అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇవ్వాలట అని ఆరోపించారు. లంచాల కోసం ప్రగతిని ఆపేసి, పర్మిసన్లు ఇస్తలేరని మండిపడ్డారు.

మూడు నెలల్లోనే ఘన్ పూర్ కు బై ఎలక్షన్

కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని, అయినా పార్టీ మారి తన రాజకీయ జీవితాన్ని శాశ్వత సమాధి చేసుకున్నాడని కేసీఆర్ అన్నారు. మూడు నెలల్లోనే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే అవుతాడని స్పష్టం చేశారు.

తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందని, ఆ దిశగా వెళ్లాలంటే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం