Jharkhand Assembly Election 2024 : ఝార్ఖండ్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఇక్కడ వారి ఓటింగ్ కీలకం
Jharkhand Assembly Election 2024 : ఝార్ఖండ్ మెుదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బుధవారం కీలకమైన మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మెుదలైంది. ఝార్ఖండ్ తొలివిడతతోపాటుగా దేశంలోని 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటుగా దేశంలోని 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక మెుదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాంచీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఉత్కర్ష్ కుమార్, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేసిందని చెప్పారు.
బుధవారం ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ జరిగింది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ మెుదలైంది. అన్ని పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, వెబ్-కాస్టింగ్ సౌకర్యాలతో సహా అన్ని ప్రాథమిక వసతులను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన అన్ని నియమాలు, నిబంధనలను అమలు చేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
మొదటి దశలో 17 సాధారణ స్థానాలు, 20 షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ), 6 షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వు చేసిన మెుత్తం 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. మిగిలిన 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న రెండో దశలో పోలింగ్ జరగనుంది, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.
రాజకీయ అస్థిరతకు పెట్టింది పేరైన ఝార్ఖండ్‌లో ఈ అసెంబ్లీ ఎన్నికలపై చాలా ఆసక్తి నెలకొంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంపై నమ్మకంతో ఉంది. హేమంత్ సోరెన్‌కు ఉన్న ఆదరణ కలిసి వస్తుందని నమ్ముతోంది. ఐదేళ్ల క్రితం చేజారిన అధికారం కోసం బీజేపీ చూస్తోంది. హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆరు నెలల కాలాన్ని మినహాయించి స్థిరమైన జేఎంఎం ప్రభుత్వాన్ని నడిపించారు.
గతంలో చోటా నాగ్‌పూర్ టెనెన్సీ యాక్ట్, సంతాల్ పరగణా టెనెన్సీ యాక్ట్‌లకు బీజేపీ ప్రభుత్వం చేసిన సవరణలు, పారిశ్రామిక, మైనింగ్ యూనిట్ల కోసం ల్యాండ్ బ్యాంక్‌ల ఏర్పాటు పట్ల ఆదివాసీలలో విస్తృతమైన అసంతృప్తికి ఆజ్యం పోసింది. ఈ ఎత్తుగడలు సాంప్రదాయ వనరులపై ఆదివాసీ హక్కులకు ముప్పుగా భావించారు. దీంతో 2014 తర్వాత 2019లో బీజెపీకి ప్రజలు అధికారాన్ని ఇవ్వలేదు.
ఝార్ఖండ్‌లో జనాభాలో దాదాపు ఆదివాసీలు 27 శాతం, ముస్లింలు 14 శాతం ఉన్నారు. మెుత్తం 41 శాతంగా ఉన్న ఈ ఓటింగ్ చాలా కీలకం. వారి ఓటింగ్ శక్తి గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా చోటానాగ్‌పూర్, సంతాల్ పరగణా ప్రాంతాలలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొల్హాన్ ప్రాంతంలో ఆదివాసీలు కూడా మెజారిటీగా ఉన్నారు.
ఝార్ఖండ్‌లో మెుదటి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలు
కోదర్మ, బర్కత, బర్హి, బర్కగావ్, హజారీబాగ్, సిమారియా (SC), చత్ర (SC), బహరగోర, ఘట్సీల (ST), పొట్కా (ST), జుగ్సలై (SC), జంషెడ్‌పూర్ తూర్పు, జంషెడ్‌పూర్ వెస్ట్, ఇచాగర్, సెరైకెల్ల (ST), చైబాసా (ST), మజ్‌గావ్ (ST), జగన్నాథ్‌పూర్ (ST, మనోహర్పూర్ (ST), చక్రధర్‌పూర్ (ST), ఖర్సవాన్ (ST), తమర్ (ST), టోర్పా (ST), కుంతి (ST), రాంచీ, హతియా, కాంకే (SC), మందార్ (ST), సిసాయి (ST), గుమ్లా (ST), బిషున్‌పూర్ (ST), సిమ్డేగా (ST), కొలెబిరా (ST), లోహర్దగా (ST), మణిక (ST), లతేహర్ (SC), పంకి, డాల్టన్‌గంజ్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్ (SC), హుస్సేనాబాద్, గర్వా, భవన్‌పూర్