Virat Kohli: విరాట్ కోహ్లీ వికెట్ కోసం పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ మాస్టర్ ప్లాన్.. 7 అడుగుల ఎత్తులో బాల్ రిలీజ్
Australia vs India 1st Test: విరాట్ కోహ్లీ వికెట్ కోసం ఆస్ట్రేలియా పెద్ద మాస్టర్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. పెర్త్ టెస్టులో హేజిల్‌వుడ్ 7 అడుగుల ఎత్తు నుంచి బంతిని రిలీజ్ చేయగా.. ఆ బంతి..?
ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ ఎంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్ అనేది అందరికీ తెలిసిందే. శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్కడ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవగా.. పెర్త్‌లో ఈరోజు నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. తొలి ఇన్నింగ్స్ కేవలం 150 పరుగులకే ఆలౌటైంది.
5 పరుగులకే ఔటైన కోహ్లీ
పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీని ఔట్ చేయడానికి ఆస్ట్రేలియా టీమ్ పక్కా ప్రణాళికతో వచ్చినట్లు తెలుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులాడిన విరాట్ కోహ్లీ కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. కేవలం 5 పరుగులు చేసి జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సింపుల్‌గా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఎక్స్‌ట్రా బౌన్స్‌తో కోహ్లీ సర్‌ప్రైజ్
మ్యాచ్‌లో తాను ఔట్ అయిన తీరుకి విరాట్ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. కానీ.. ఆస్ట్రేలియా మాత్రం ఈ వికెట్‌ను ముందే ఊహించినట్లు ఉన్నారు. హేజిల్‌వుడ్ షార్టెన్ లెంగ్త్ బాల్‌ని విసరగా.. విరాట్ కోహ్లీ తొలుత డిఫెన్స్ చేయాలని ప్రయత్నించాడు. కానీ.. ఊహించని విధంగా బౌన్స్ అయిన బంతి విరాట్ కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తాకి.. స్లిప్‌లో గాల్లోకి లేచింది. దాంతో ఖవాజా సింపుల్‌గా క్యాచ్ అందుకున్నాడు.
డబుల్ మైండ్‌తో కోహ్లీ డిఫెన్స్
విరాట్ కోహ్లీ కోసం ఆ బంతిని దాదాపు 7 అడుగల 5 అంగుళాలు ఎత్తు నుంచి హేజిల్‌వుడ్ రిలీజ్ చేశాడు. హేజిల్‌వుడ్ హైట్ 6 అడుగుల 5 అంగుళాలు. దాంతో తన ఎత్తుని వినియోగించుకుంటూ అతను విసిరిన బంతి ఎక్స్‌ట్రా బౌన్స్ అయ్యింది. దాంతో విరాట్ కోహ్లీ డబుల్ మైండ్‌లో ఆ బంతిని డిఫెన్స్ చేయబోయి దొరికిపోయాడు.
వారం నుంచి ప్రాక్టీస్
విరాట్ కోహ్లీని ఒక బలహీనత సుదీర్ఘకాలంగా వెంటాడుతోంది. ఆఫ్ స్టంప్‌కి అవల పడే బంతుల్ని వెంటాడుతూ కీపర్ లేదా స్లిప్‌లో ఫీల్డర్లకి దొరికిపోతూ ఉంటాడు. దాంతో ఈ సిరీస్‌లో ఆ బలహీనతని దిద్దుకోవడానికి గత వారం నుంచి పెర్త్‌లోనే ప్రాక్టీస్ చేశాడు. అయితే.. ఈ ఆస్ట్రేలియా టీమ్ ఎక్స్‌ట్రా బౌన్స్ వ్యూహాన్ని మాత్రం అంచనా వేయలేకపోయాడు.