Virat Kohli: పెర్త్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా బౌలర్లకి విరాట్ కోహ్లీ వార్నింగ్, ఆసీస్‌లో రికార్డులివే-india batter virat kohli picks his greatest test knock in australia ahead of ind vs aus 1st test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: పెర్త్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా బౌలర్లకి విరాట్ కోహ్లీ వార్నింగ్, ఆసీస్‌లో రికార్డులివే

Virat Kohli: పెర్త్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా బౌలర్లకి విరాట్ కోహ్లీ వార్నింగ్, ఆసీస్‌లో రికార్డులివే

Galeti Rajendra HT Telugu
Nov 18, 2024 08:41 PM IST

IND vs AUS 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై 2011 నుంచి విరాట్ కోహ్లీ పర్యటిస్తున్నాడు. ఇప్పటి వరకూ అక్కడ కోహ్లీ ఆరు సెంచరీలు నమోదు చేయగా.. పెర్త్ టెస్టులో చేసిన శతకం ఇప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్లని వెంటాడుతోంది.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (BCCI)

పెర్త్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియాకి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే పెర్త్‌కి చేరుకున్న భారత టెస్టు టీమ్‌లోని ఆటగాళ్లు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా కోహ్లీ 6 సెంచరీలు

ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది. 2011 నుంచి 2020 వరకు ఆస్ట్రేలియాలో మొత్తం 13 టెస్టులు ఆడిన కోహ్లీ.. 54.08 సగటుతో పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆరు సెంచరీలు కోహ్లీ బాదగా.. అడిలైడ్‌లో మూడు, పెర్త్, మెల్‌బోర్న్, సిడ్నీలో ఒక్కో సెంచరీ ఉంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా ఆడిన ఇన్నింగ్స్‌లో నీ బెస్ట్ ఇన్నింగ్స్ ఏది? అని విరాట్ కోహ్లీని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రశ్నించాడు. దానికి కోహ్లీ సమాధానమిస్తూ పెర్త్‌లో బాదిన సెంచరీని గుర్తు చేసుకున్నాడు.

పెర్త్‌లో కోహ్లీకి తిరుగులేని రికార్డ్

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో నేను ఆడిన అత్యంత కఠినమైన పిచ్ పెర్త్‌ అని గుర్తు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు 2018-19లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో గెలుచుకుంది. అయితే.. ఆ సిరీస్‌లో భారత్ ఓడిన మ్యాచ్ పెర్త్‌ టెస్టు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 257 బంతుల్లో 123 పరుగులు చేసినా.. భారత్ జట్టుకి 146 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్

ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. బ్యాటింగ్‌కి పిచ్ కష్టంగా ఉన్నా విరాట్ కోహ్లీ వీరోచితంగా ఆ టెస్టులో ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 326 పరుగులు చేయగా.. కోహ్లీ సెంచరీ బాదడంతో భారత్ జట్టు 283 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులకి ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 287 పరుగుల టార్గెట్ నిలిచింది. అయితే.. ఛేదనలో టీమ్ఇండియా 140 పరుగులకే కుప్పకూలింది.

22 నుంచి పెర్త్‌లోనే టెస్టు

మ్యాచ్‌లో భారత్ ఓడినా.. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఆస్ట్రేలియా బౌలర్లని కోహ్లీ ఎదుర్కొన్న తీరు.. వారిపై చేసిన ఎదురుదాడిని ఇప్పటికీ కంగారూల బౌలర్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. నవంబరు 22 నుంచి అదే పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దాంతో ఆ సెంచరీని గుర్తు చేసుకోవడం ద్వారా కోహ్లీ హెచ్చరికలు పంపినట్లు అయ్యింది.

Whats_app_banner