Virat Kohli: విరాట్ కోహ్లీని వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. పదేళ్ల తర్వాత ఫస్ట్ టైమ్ ఇలా!-virat kohli out of top 20 in icc test rankings for first time in 10 years ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: విరాట్ కోహ్లీని వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. పదేళ్ల తర్వాత ఫస్ట్ టైమ్ ఇలా!

Virat Kohli: విరాట్ కోహ్లీని వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. పదేళ్ల తర్వాత ఫస్ట్ టైమ్ ఇలా!

Galeti Rajendra HT Telugu
Nov 06, 2024 09:36 PM IST

ICC Test rankings: టెస్టుల్లో గత 10 ఏళ్లుగా తిరుగులేని రికార్డులు నెలకొల్పుతూ వచ్చిన విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది ఘోరంగా విఫలమవుతూ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారిపోయాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది టెస్టుల్లో పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. దాంతో ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ కనీసం టాప్-20లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఒకానొక దశలో టెస్టుల్లో నెం.1 ఉండి.. ఆ తర్వాత కూడా ఏళ్లకి ఏళ్లుగా టాప్-10లో చోటు నిలుపుకుంటూ వచ్చిన కోహ్లీ ఇలా టాప్-20లో చోటు దక్కించుకోలేకపోవడం టీమిండియా అభిమానుల్ని కలవరపరిచే అంశమే.

3 టెస్టుల్లో 93 పరుగులే

న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో కనీసం హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు కేవలం 93 మాత్రమే చేశాడు. దాంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 22వ స్థానానికి దిగజారిపోయాడు.

2014 తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్-20లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కోహ్లీతో పాటు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఫెయిలైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు కోల్పోయి బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 26వ స్థానానికి పడిపోయాడు.

టాప్-10లో ఇద్దరు భారత్ ప్లేయర్లు

టెస్టుల్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఇటీవల పాకిస్థాన్ పర్యటనలో డబుల్ సెంచరీ సాధించి నెం.1 స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఉన్నారు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. శుభమన్ గిల్ 16వ స్థానంలో ఉన్నాడు.

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో జడేజా 10 వికెట్లు పడగొట్టాడు. టెస్టు బౌలర్ల జాబితాలో వాషింగ్టన్ సుందర్ ఏడు స్థానాలు ఎగబాకి 46వ స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 12 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. అలానే ఇష్ సోధీ మూడు స్థానాలు ఎగబాకి 70వ స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియా‌తో ఐదు టెస్టులు

భారత్ జట్టు నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా గడ్డపై ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే ఈ సిరీస్‌లో కనీసం నాలుగు టెస్టులను భారత్ గెలవాలి. ఆ ఐదో టెస్టులోనూ ఓడిపోకుండా డ్రా చేసుకోగలిగితే.. సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్తు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేరకు టెస్టు సిరీస్ కోసం త్వరలోనే భారత్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లనుంది.

Whats_app_banner