Game Changer: అమెరికా గడ్డపై రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ అరుదైన ఘనత.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించే ఛాన్స్
Ram Charan: గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో తెలుగు సినిమా ప్రమోషన్స్ చేశారు. కానీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతుండటం ఇదే తొలిసారి.
రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ అరుదైన ఘనతని అందుకోబోతోంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు తెలుగు సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ యుఎస్‌లో జరగలేదు. అయితే.. డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరుకానున్నట్లు సమాచారం.
సాంగ్స్, టీజర్‌కి మంచి స్పందన
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించబోతుండగా.. అతని జంటగా కియారా అద్వానీ నటించారు. అలానే సీనియర్ హీరో శ్రీకాంత్, నవీన్ చంద్ర, హీరోయిన్ అంజలి, ఎస్.జె.సూర్య సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆచార్య తర్వాత హిట్ కోసం
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్నారు. ఆచార్య సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో ఈ గేమ్ ఛేంజర్ మూవీపై రామ్ చరణ్ మాత్రమే కాదు మెగా అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు-2 బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దాంతో శంకర్ కెరీర్‌లో కూడా ఈ గేమ్ ఛేంజర్ మూవీ కీలకంకానుంది.
సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛేంజర్
వచ్చే ఏడాది సంక్రాంతి ముంగిట ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‌కానుంది. ఇప్పటికే జనవరి 10వ తేదీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించేసింది. అలానే లక్నో ఇటీవల టీజర్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. రిలీజ్ ముంగిట దేశంలోని చాలా నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించే అవకాశం ఉంది.