TG Samagra Kutumba Survey : రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు.. వీడియో-telangana samagra kutumba survey documents seen on the road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Samagra Kutumba Survey : రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు.. వీడియో

TG Samagra Kutumba Survey : రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు.. వీడియో

TG Samagra Kutumba Survey : సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. అయితే.. అవి ఖాళీ పేపర్లు కాదు. ప్రజల నుంచి వివరాలు సేకరించిన వాటిని రోడ్డుపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు.

రోడ్డుపై సర్వే పత్రాలు

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో భాగంగా.. అధికారులు ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్, ఫోన్ నంబర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇంకా కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాంటి సర్వే పేపర్లు ఇప్పుడు నడిరోడ్డుపై దర్శనమిస్తున్నాయి. ఖాళీ పేపర్లు కాకుండా వివరాలు సేకరించిన పేపర్లు రోడ్డుపై పడి ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై మాజీమంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.

'నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు.. నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు.. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం. రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం?' అని హరీష్ రావు ప్రశ్నించారు.

'సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది. సైబర్‌ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని హరీష్ ట్వీట్ చేశారు.

నవంబర్ 6న సర్వే ప్రక్రియ మొదలైంది. 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఎన్యూమరేటర్లు ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికీ వెళ్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యంతరాలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.

పలుచోట్ల ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలను ప్రభుత్వానికి ఎందుకివ్వాలంటూ ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుంటే.. ఈ కుటుంబ సర్వేపై సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతూ.. జనాలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

కుటుంబ సర్వేలో భాగంగా బ్యాంక్ ఖాతా వివరాలు అడగటంపై వస్తున్న విమర్శలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ అడగడం లేదని.. కేవలం ఉందా లేదా అన్న విషయం మాత్రమే అడుగుతున్నట్టు వివరించారు. బ్యాంక్ ఖాతాకు ఆప్షన్ అడుగుతున్నామని.. ఆధార్ కార్డు కూడా తప్పనిసరి కాదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.