Team India: పెర్త్ టెస్టులో భారత్‌ని గెలిపించిన ఐదుగురు హీరోలు.. ఆస్ట్రేలియాని కవ్వించి మరీ కళ్లెం
India vs Australia 1st Test: పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాని మట్టికరిపించిన భారత్ జట్టు.. చారిత్రక విజయాన్ని ఆదివారం నమోదు చేసింది. ఈ గెలుపులో ఐదుగురు క్రికెటర్లు క్రియాశీలక పాత్ర పోషించారు.
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులోనే భారత్ ఘన విజయం సాధించింది. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత జట్టు విజయంలో కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా, యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పాత్ర ఎక్కువగా ఉన్నప్పటికీ.. మరో ముగ్గురు క్రికెటర్ల కష్టాన్ని కూడా టీమిండియా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా
పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 150 పరుగులకు ఆలౌటైనప్పుడు.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. బౌలింగ్‌లో సత్తాచాటిన జస్‌ప్రీత్ బుమ్రా 18 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దెబ్బకి ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటై.. భారత్‌కి 46 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే వరుస వికెట్లతో బుమ్రా షాక్ ఇవ్వడంతో పాటు.. టాప్ స్కోరర్‌గా నిలిచి కాసేపు కంగారుపెట్టిన ట్రావిస్ హెడ్ వికెట్‌ను పడగొట్టి భారత్‌కి విజయాన్ని ఖాయం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
యశస్వి జైశ్వాల్
తొలిసారి ఆస్ట్రేలియాకు పర్యటనకి వచ్చిన యశస్వి జైశ్వాల్.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణరీతిలో బ్యాటింగ్ చేసిన 161 పరుగులు చేశాడు. దెబ్బకి భారత్ జట్టు చేతిలోకి మ్యాచ్ వచ్చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లని కవ్విస్తూ.. వారి లయ తప్పేలా చేసిన యశస్వి.. మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించేశాడు.
కేఎల్ రాహుల్
పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేసినా.. యశస్వి జైశ్వాల్‌కి అతను అందించిన సహకారం విస్మరించలేనిది. తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్లు పడుతున్న వేళ.. 74 బంతులు ఆడి 26 పరుగుల చేసిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో 176 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో యశస్వితో కలిసి మొదటి వికెట్‌కి 201 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ జట్టు భారీ స్కోరుకి బాటలు వేశారు.
విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ రికార్డులేంటో అందరికీ తెలిసిందే. కానీ.. గత ఏడాదికాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులకే ఔటైపోయాడు. కానీ..రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదేసి.. టెస్టు కెరీర్‌లో 30వ శతకాన్ని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీతో ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిలపగలిగింది.
నితీశ్ కుమార్ రెడ్డి
టీంఇండియా తరఫున అరంగేట్ర టెస్టు ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి రెండు ఇన్నింగ్స్ ల్లోనూ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన నితీశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలానే కీలకమైన మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టాడు.
ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, నాథన్ లయన్‌ను స్లెడ్జింగ్‌తో యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్ కవ్వించారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు విసిరిన బౌన్సర్లకి సిక్సర్లతో సమాధానం చెప్పిన యశస్వి జైశ్వాల్ వాళ్ల ఇగోని హర్ట్ చేశాడు. అలానే రిషబ్ పంత్ కూడా వికెట్ల వెనుక నుంచి తనదైన శైలిలో స్లెడ్జింగ్‌కి దిగాడు.