AP Heavy Rains : రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండం-దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
AP Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం పుదుచ్చేరికి 980 కి.మీ, చెన్నైకి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం(Low Pressure) పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం ప్రస్తుతానికి దక్షిణ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై వాయుగుండంగా (Depression) రూపాంతరం చెందిందని పేర్కొంది. వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి 600 కి.మీ, నాగపట్నానికి 880 కి.మీ, పుదుచ్చేరికి 980 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది తీవ్రవాయుగుండంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.
సోమవారం నాటికి తీవ్ర వాయుగుండం తమిళనాడు, శ్రీలంక వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
నవంబర్ 26 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 29న విశాఖ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. వాయుగుండం తుపాను మారే అవకాశం ఉందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉందన్నారు.
రైతులు, మత్స్యకారులకు అలర్ట్
దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని పలు ఓడ రేవులలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోతలు చేపట్టవద్దని, ఇప్పటి కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. తుపాను ప్రభావం కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది.
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం పొగమంచు పెరుగుతోంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. భద్రాచలం, హకీంపేట, రామగుండం, ఖమ్మం, పటాన్‌చెరు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కన్నా తక్కువగా రికార్డు అయ్యాయి.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు దిగువన రికార్డు అవుతున్నాయి. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావం తెలంగాణపై లేకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు.
సంబంధిత కథనం