Mahabubabad : మానుకోట రాళ్ల మహత్యం ఏందో వాళ్లందరికీ తెలుసు : కేటీఆర్
Mahabubabad : లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేవలం తన అల్లుడు, అన్న, తమ్ముడి కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆరోపించారు.
14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న.. కొత్త నియంతకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైందని స్పష్టం చేశారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
'అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లో లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. అక్కడ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు. వారి భూములను తీసుకుంటామని చెబుతే మా ఆడబిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రి కి సమయం లేదు. కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం 28 పైసలు కూడా తేలేదు' అని కేటీఆర్ విమర్శించారు.
'సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారు. ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు. రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'సన్నకారు, బక్క చిక్కిన రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. మా గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే.. లగచర్లలో జరిగిన సంఘటనకు మానుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ ప్రశ్నించారు. కొడంగల్ రైతుల కోసం ఒక్క మానుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
'రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టమని చెబుతున్నా. ఎవని కోసం ఫార్మా విలేజ్? తన అల్లుడి కోసం పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు, అదానీ, అన్న, తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం లేదు. మరో 10 రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చారా? ఒక్క హామీనైనా నెరవేర్చారా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'ఇక్కడున్న డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు టైమ్‌కు వస్తుండేనా, రైతు బీమా వచ్చిందా, 24 గంటలు కరెంట్ వస్తుండేనా? రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొట్టిండు. పింఛన్ పెంచలేదు. బోనస్ బోగస్ అయ్యింది. ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీం వచ్చిందా? మహారాష్ట్రకు పోయి ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేశాడని చైతన్యం ప్రదర్శించి తన్ని తన్ని తరిమేశారు' అని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
'నేను ఇక్కడ వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమని అంటున్నారు. నేను డీజీపీ, ఎస్సీని అడుగుతున్నా.. రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడతామా? మేము కేసీఆర్ తయారు చేసిన దళం. భయపడే ప్రసక్తే లేదు' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
'మానుకోట రాళ్ల మహత్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల క్రితమే నిప్పు పుట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. వెయ్యి మంది అనుకుంటే 25 వేల మంది వచ్చారు. అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతోంది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.