SC On Housing Allocations: తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆ భూకేటాయింపులు రద్దు-supreme courts sensational verdict on allotment of house plots in telangana cancellation of land allotments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sc On Housing Allocations: తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆ భూకేటాయింపులు రద్దు

SC On Housing Allocations: తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆ భూకేటాయింపులు రద్దు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 25, 2024 04:46 PM IST

SC On Housing Allocations: తెలంగాణలో భూ కేటాయింపులై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు ప్రభుత్వ భూ కేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వడ్డీతో రిఫండ్‌ చెల్లించాలని ఆదేశించింది.

భూకేటాయింపులపై  సుప్రీం కోర్టు సంచలన తీర్పు
భూకేటాయింపులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

SC On Housing Allocations: తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్థలాల కోసం భూ కేటాయింపులను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఇప్పటికే చేసిన అన్ని భూ కేటాయింపులను రద్దు చేయడంతో పాటు డబ్బులు చెల్లించిన వారికి తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్‌బిఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ఇంటి స్థలాలను కేటాయిస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త చెలికాని రావు న్యాయపోరాటం చేస్తున్నారు.

జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, ఐఏఎస్‌,ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగమేనని, జీవో నంబర్ 243 జారీ చేయడాన్ని పిటిషనర్‌ సవాలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో భాగమైన జ్యూడిషియల్‌, బ్యూరోక్రాట్స్‌, పొలిటిషియన్స్‌కు ఇళ్ల స్థలాలను కేటాయించడం సరికాదని వాదించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 2008లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 గజాల నుంచి 100 గజాల ఫ్లాట్లు, జర్నలిస్టులకు 300గజాలు, ఆలిండియా సర్వీస్ అధికారులకు 500గజాలు కేటాయించడాన్ని పిటిషనర్‌ తప్పు పట్టారు. సుదీర్ఘ కాలం పాటు ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. కొద్ది నెలల క్రితమే జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. తాజాగా భూ కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ హౌసింగ్ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు జర్నలిస్టులకు కొద్ది నెలల క్రితం ఇళ్ల స్థలాలను కేటాయించారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఏమి జరుగుతుందనే ఆందోళన లబ్దిదారుల్లో నెలకొంది.

 

Whats_app_banner