TG New Airports : తెలంగాణకు మరో 3 ఎయిర్‌పోర్టులు.. 7 ముఖ్యమైన అంశాలు
TG New Airports : ప్రస్తుతం ఉన్న శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు కాకుండా.. మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల వరంగల్ విషయంలో క్లారిటీ వచ్చింది. మరో 3 ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉన్నా.. ప్రయాణికులకు అందుబాటులో లేదు. కేవలం ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యామైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఇటీవల జరిగిన వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
2.ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి. కేంద్రంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఉండడంతో.. అనుమతుల విషయంలోనూ సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది.
3.వరంగల్ మామునూరులో నిజాం కాలంలోనే వాయుదూత్ విమానాలు నడిచేవి. ఇక్కడ విమానాశ్రయం మూతపడి 32 ఏళ్లు కావొస్తోంది. దీనికి 696.14 ఎకరాల భూమి ఉంది. మరింత భూమి కావాలని ఏఏఐ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను విడుదల చేస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
4.మొదటి దశలో మామునూరు విమానాశ్రయాన్ని చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. మాస్టర్ ప్లాన్ తయారీ, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి 8 నెలల గడువును లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో విమానాల ఆపరేషన్‌కు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
5.రాబోయే నాలుగేళ్లలో వరంగల్ తోపాటు.. రామగుండం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పటికే సుమారు వెయ్యి ఎకరాల్లో ఇందుకు అడుగులు పడుతున్నాయి. మూడు మండలాల పరిధిలో భూసేకరణపై అధికారులు అంచనాకు వచ్చారు.
6.రామగుండంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు త్వరలోనే అడ్డంకులు తొలిగే అవకాశాలు ఉన్నాయి. రామగుండం సమీపంలోని బసంత్‌నగర్‌లో గతంలోనే ఎయిర్‌పోర్టు ఉండేది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో కొత్తది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
7.అటు ఆదిలాబాద్‌లోనూ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ సుమారు 1600 ఎకరాల్లో భూమి సిద్ధంగా ఉంది. గతంలోనే ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు సానుకూల స్పందన వస్తే.. అందుకు కావాల్సిన అన్నీ సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.