Telangana Weather : 3 జిల్లాలకు ఆరెంజ్.. 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వణికిపోతున్న తెలంగాణ
Telangana Weather : తెలంగాణను చలి వణికిస్తోంది. ఉదయం 8 లోపు, సాయంత్ర 6 తర్వాత బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో మూడు పరిస్థితులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రతీ సంవత్సరం డిసెంబర్‌లో చలి బాగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ.. ఈ ఏడాది నవంబర్ నెలలోనే చలి చంపేస్తోంది. బయటకు రావాలంటే జనం భయపడే పరిస్థితి ఉంది. చలితోపాటు గాలులు రావడంతో.. ప్రజలు వణికిపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలా జిల్లాలో 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి.
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఈ జిల్లాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
పిల్లలు జాగ్రత్త..
చలికాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ కాలంలో చిన్నారులకు జలుబు, దగ్గు, జర్వం లాంటివి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే పిల్లలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చలికాలంలో వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
పిల్లలను చలి నుంచి రక్షించి వారి శరీరం వెచ్చగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఉన్ని స్వెటర్లు తప్పనిసరిగా వేయాలి. చలితీవ్రత ఎక్కువగా ఉండే చేతులకు గ్లవ్స్, కాళ్లకు సాక్స్ వేయాలి. బయటికి వెళితే షూ వేయాలి. పిల్లల శరీరానికి నేరుగా చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. పిల్లల శరీరంలో వెచ్చదనం తగ్గితే జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యం పైలం..
చలికాలంలో వృద్ధులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తు్ననారు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణంలో కీళ్లనొప్పులు పెరుగుతాయని.. వైరల్ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. వృద్ధులకు రక్త ప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే ప్రమాదముంది. ఈ సమయంలో వేడినీళ్లు తాగాలని సూచిస్తున్నారు.