Hyderabad NIMS : హైదరాబాద్ నిమ్స్‌కు లండన్ డాక్టర్లు.. చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొండి
Hyderabad NIMS : తెలంగాణలో ఎంతో మంది చిన్నారులు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చనిపోతున్నారు. మరికొందరు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు.
యూకేకు చెందిన వైద్యుల బృందం.. సెప్టెంబర్ 22-28 మధ్య హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనుంది. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు (CHD) ఉన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలను చేయనుంది. రమణ ధన్నపునేని ఈ వైద్య నాయకత్వం వహించనున్నారు.
CHD అనేది పుట్టుకతో వచ్చే లోపం. ఇది గుండె నిర్మాణం, పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇది గుండె గోడలో రంధ్రాలు, గుండె కవాటాల్లో సమస్యలు సృష్టిస్తుంది. కొన్ని లోపాలు తేలికపాటిగా ఉంటాయి. వాటికి చికిత్స అవసరం లేకపోవచ్చు. కానీ.. మరికొన్ని తీవ్రమైనవి ఉంటాయి. వీటిపట్ల జాగ్రత్త వహించి వెంటనే చికిత్స చేయించాలని వైద్యులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, నిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ విభాగం సహకారంతో.. వారం రోజుల పాటు శిబిరం నిర్వవహించనున్నారు. ఈ శిబిరంలో పిల్లలకు ఉచితంగా 2డి ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లను కూడా తీయనున్నారు. "డాక్టర్ రమణ.. ప్రతి సంవత్సరం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత శస్త్రచికిత్స అందించే వైద్య నిపుణుల బృందానికి నాయకత్వం వహిస్తారు" అని నిమ్స్ డైరెక్టర్ ఎన్. భీరప్ప వివరించారు.
గుండె సంబంధిత సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులు.. 040-23489025లో సంప్రదించవచ్చని నిమ్స్ అధికారులు వివరించారు. లేకపోతే మంగళ, గురు, శుక్రవారాల్లో నేరుగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్‌కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. వచ్చే ముందు మునుపటి రికార్డులను తీసుకురావాలని వైద్యులు సూచించారు. రికార్డు అందుబాటులో లేకుంటే.. ఆసుపత్రిలోనే అవసరమైన స్క్రీనింగ్ నిర్వహిస్తామని డాక్టర్ భీరప్ప వివరించారు.
తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ.. ఈ ప్రాంతంలో పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ సేవల ఆవశ్యకతను గుర్తించారు. డిసెంబరు 2022లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నీలోఫర్ హాస్పిటల్, నిమ్స్ మధ్య భాగస్వామ్యాన్ని అప్పటి ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రతిపాదించారు. దీని ఫలితంగా నిమ్స్‌లో వరుస శిబిరాలు జరిగాయి. మార్చి 2023లో మొదటి శిబిరం జరిగింది. తొమ్మిది ఉచిత శస్త్రచికిత్సలు చేశారు. సెప్టెంబరులో జరిగిన రెండో శిబిరంలో ఒక వారంలో 15 శస్త్రచికిత్సలు చేసినట్టు డాక్టర్ రమణ వివరించారు.