RGV Issue: ఆర్జీవీ ఇంటి దగ్గర హైడ్రామా, వర్మ ఇంటి ముందు ఒంగోలు పోలీసులు
RGV Issue: సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్‌లోని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పోలీసులు రావడానికి ముందు వర్మ అదృశ్యమైపోయారు.
RGV Issue: దర్శకుడు రాంగోపాల్ వర్మ మాయం అయ్యారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వర్మ ఇంటి నుంచి మాయం అయ్యారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ‌్యలు, పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు వర్మ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో వర్మ ఇంటిికి చేరుకున్నారు. ఇద్దరు ఎస్సైలతో పాటు ఆరుగురు కానిస్టేబుళ్లు ఆర్జీవి నివాసానికి చేరుకున్నారు.
పోలీసులు చేరుకునే సమయానికి వర్మ ఇంట్లో లేరని సిబ్బంది పోలీసులకు చెప్పడంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వ వైఖరి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు విచారణకు హాజరవ్వడంపై తగిన గడువు కావాలంటే పోలీసులను కోరాలని హైకోర్టు గత వారం సూచించింది. ఆ తర్వాత మద్దిపాడు పోలీసులకు వర్మ తరపు న్యాయవాది విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరుతూ లేఖను అందించారు.
ఆ తర్వాత మరోసారి వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులకు వర్మ స్పందించకపోవడంతో ఆయన్ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు ఏపీ పోలీసుల తీరును వర్మ తరపు లాయర్ తప్పు పట్టారు. పోలీసుల విచారణకు గడువు కోరే హక్కు వర్మకు ఉంటుందని చెప్పారు.
వర్మపై దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉందని, ఆయన దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయలేదన్నారు. వర్మపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని వర్మ తరపు లాయర్ హెచ్చరించారు. న్యాయపరంగా తమకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకునే హక్కు ఉంటుందని చెప్పారు. వర్మ ముందస్తు షెడ్యూల్ మేరకు షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్ళారని చెప్పారు. పోలీసుల బెదిరింపు చర్యలకు భయపడేది లేదని లీగల్ తేల్చకుంటామని వర్మ న్యాయవాది మీడియాకు వివరించారు.