TG Road Tax : తెలంగాణ వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రోడ్ ట్యాక్స్‌ పెంపునకు కసరత్తు-road tax likely to increase soon in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Road Tax : తెలంగాణ వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రోడ్ ట్యాక్స్‌ పెంపునకు కసరత్తు

TG Road Tax : తెలంగాణ వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రోడ్ ట్యాక్స్‌ పెంపునకు కసరత్తు

Basani Shiva Kumar HT Telugu
Published Nov 25, 2024 09:58 AM IST

TG Road Tax : కొన్ని రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ అధికారులు స్టడీ చేశారు. ఆ విధానాలనే తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. తెలంగాణలోనూ రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది.

రోడ్ ట్యాక్స్‌
రోడ్ ట్యాక్స్‌ (HT File)

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ ద్వారా ఆదాయం భారీగా వస్తోంది. కేరళలో గరిష్ఠంగా 21 శాతం రోడ్ ట్యాక్స్ ఉంటే.. తమిళనాడులో 20 శాతం ఉంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్‌తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్‌ ట్యాక్స్‌‌ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయన నివేదికను త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించనున్నారు. సబ్ కమిటీ దానిపై చర్చించి రోడ్‌ ట్యాక్స్‌పై నిర్ణయం తీసుకోనుంది. కార్లు, బైక్‌లకు సంబంధించి ప్రస్తుతం శ్లాబులను సవరించే అవకాశాలు ఉన్నాయి. లక్ష రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న బైక్‌లు, రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణలో రోడ్‌ ట్యాక్స్‌ పెరిగే అవకాశం ఉన్నా.. ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్ ట్యాక్స్ ద్వారా సుమారు 7వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒకవేళ రోడ్ ట్యాక్స్ పెంచితే.. 8 వేల కోట్ల రూపాయల నుంచి రూ.9వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో ఇప్పుడు రూ.5 లక్షల లోపు కార్లకు 13 శాతం, రూ.5 నుంచి 10 లక్షల మధ్య ఉన్న కార్లకు 14 శాతం, రూ.10 నుంచి 20 లక్షల మధ్య 17 శాతం, రూ.20 లక్షలు పైన ధర ఉన్న కార్లకు 18 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బైక్‌లకు సంబంధించి.. రూ.50 వేల లోపు వాహనాలకు 9 శాతం, ఆపై విలువ ఉంటే 12 శాతం రోడ్‌ ట్యాక్స్‌ ఉంది.

అయితే.. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రకాల శ్లాబులు కాకుండా.. తక్కువ శ్లాబులతో రోడ్ ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలను సబ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. అయితే.. ఇప్పట్లో ట్యాక్స్ పెంచే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు.

Whats_app_banner