KTR Tour: నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్, ఫ్లెక్సీ వార్‌తో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం
KTR Tour: మహబూబాబాద్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్ల ఘటన బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా నిర్వహించనుండగా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.కేటీఆర్ రాక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.
KTR Tour: లగచర్ల ఘటన బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా నిర్వహించనుంది.ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో గందరగోళం నెలకొంది.
కొన్ని చోట్ల కేటీఆర్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వెలియడంతో ఏం జరుగుతుందోనని చర్చ జరుగుతోంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. కాగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా చేపట్టనుండగా.. మహబూబాబాద్ పట్టణంలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
హై కోర్టు పర్మిషన్ తో మహాధర్నా
లగచర్ల బాధితుల కు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నేడు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కల్లపెల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితర పార్టీ ముఖ్య నేతలు మహా ధర్నాకు తరలి రానున్నారు.
ఈ నెల 21 వ తేదీనే ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ ప్లాన్ చేయగా.. పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో చివరి నిమిషం వరకు పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మహా ధర్నా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఆ తరువాత హై కోర్టు కు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఈ మేరకు సోమవారం ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ధ్వంసం
మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సిలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే చించేసారనీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తునారు. ఫ్లెక్సీల ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిస్థితులు చేయి దాటకుండా పోలీసు బలగాలతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ధర్నాను అడ్డుకుంటామంటున్న గిరిజనులు
అధికారంలో ఉన్నన్ని రోజులు దళిత, గిరిజనులను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు లగచర్ల ఘటనపై మహా ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందని కొందరు గిరిజన సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్నాను అడ్డుకుంటామని కొందరు గిరిజన సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే గత ప్రభుత్వ హయాంలో దళితుల భూములను అన్యాక్రాంతం చేశారని, వివిధ అవసరాల పేరుతో దళితుల భూములను లాక్కున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ' కేటీఆర్ గో బ్యాక్ ' అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు. దీంతో జిల్లాలో గందరగోళం నెలకొంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)