Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో, క్లారిటీ!
Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఏవీ రంగనాథ్ స్పందించారు. తన ఇల్లు బఫర్ జోన్ లో లేదని క్లారిటీ ఇచ్చారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు.
Hydra Commissioner House : హైడ్రా పేరు చెబితే హైదరాబాద్ లో అక్రమ నిర్మాణదారులు వణికిపోతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియోలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇంటిని కూడా కూల్చివేయాలని డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.
తన ఇల్లు బఫర్ జోన్ లో ఉన్న విషయంపై వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మధురానగర్‌లోని తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువును 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారన్నారు. ఈ కృష్ణకాంత్ పార్క్‌కు తన ఇంటికి మధ్య వేలాది ఇండ్లు ఉన్నాయన్నారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రాదన్నారు. తన ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ కు పైగా దూరంలో ఉందన్నారు.
ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో- బక్కా జడ్సన్ ఆరోపణలు
హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం హైడ్రాను రూపొందించింది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా...బుల్డోజర్లతో విరుచుకుపడుంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. హైడ్రా కూల్చివేతలతో విమర్శలు రావడంతో... ఇటీవల కాస్త స్పీడ్ తగ్గించింది. కూల్చివేతలతో హైడ్రా సామాన్యుల ఆగ్రహానికి గురైంది. తాజాగా హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్‌లోనే ఉందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు ఉంది. ఇది చెరువు బఫర్ జోన్ లో ఉంనది బక్కా జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పెద్ద చెరువును పూడ్చివేసి కృష్ణకాంత్ పార్కు నిర్మించారని చెప్పుకొచ్చారు. చెరువు గట్టున మైసమ్మ ఆలయం ఉంటుందని, కృష్ణకాంత్ పార్కు సమీపంలో కూడా మైసమ్మ గుడి ఉందన్నారు. గతంలో అక్కడ చెరువు ఉండేదని చెప్పేందుకు మైసమ్మ ఆలయమే నిదర్శనమన్నారు. వందేళ్ల క్రితం నాటి మ్యాప్ లలో ఆధారాలు కనిపిస్తాయన్నారు. రెండు నెలలు కష్టపడి వందేళ్ల నాటి పెద్ద చెరువు మ్యాప్ ను సంపాదించానని బక్కా జడ్సన్ అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉంటున్న ప్రస్తుత ఇల్లు పెద్ద చెరువు బఫర్ జోన్‌లోనే ఉందని చెప్పుకొచ్చారు. తన ఇల్లు చెరువు బఫర్ జోన్‌లో లేదని ఏవీ రంగనాథ్ నిరూపించుకోవాలని జడ్సన్ సవాల్ విసిరారు.
సంబంధిత కథనం