Eluru Crime : ఏలూరు జిల్లాలో జంట హత్యలు, ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడు దారుణ హత్య?
Eluru Crime : ఏలూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలకు ఆస్తి తగాదాలే కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండవల్లి గ్రామానికి చెందిన రొయ్యారు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్ బాబు (55) సంతానంగా ఉన్నాడు. అయితే నగేష్ బాబు పుట్టిన తరువాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంభను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు.
దీంతో సుబ్బారావు, భ్రమరాంబ (60)కు సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల క్రితమే మరణించాడు. నగేష్ బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. టీడీపీ అనుబంధం ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, ఆరు సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్ బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి. నిరంతరం తగాదాలు పడుతున్నారు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇటీవలి 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయిత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారమే గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్య చేశారు.
దీంతో భ్రమరాంబ బయటకు పరుగులు తీయగా వెంటపడి మెడ, వీపు భాగంలో దాడి చేశారు. గొంతె కోసి నరికి చంపేశారు. శనివారం ఇంటి వరండాలో రక్తపు మడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కల వారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపత్యంలో ఈ హత్యలు జరిగనట్లు భావిస్తున్నామని తెలిపారు. సుబ్బారావు, మొదటి భార్య నాంచారమ్మ కుమారుడు నగేష్ బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లూస్ టీం, డాగ్ టీంలతో కలిసి ఆధారాలను సేకరిస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు