BC Ranabheri : 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం : ఆర్ కృష్ణయ్య
BC Ranabheri : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సంచలన ప్రకటన చేశారు. 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ప్రైవేట్ రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
మొత్తం 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభను నిర్వహిస్తున్నామని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణలలో కులగన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి.. బీసీల సంక్షేమం కోసం పనిచేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న కృష్ణయ్య.. కేంద్రం అమలు చేస్తున్న 27 శాతం నుండి 50 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి కేంద్రం రూ. 2 వేల కోట్లు ఇవ్వడం సమంజసమేనా? అని ప్రశ్నించారు.
సోమవారం (25.11.2024)న నిర్వహించబోయే బీసీ రణ భేరి మహాసభకు అఖిలపక్షాన్ని పిలుస్తున్నాం.. అన్ని పార్టీల నేతలు వస్తున్నారని వెల్లడించారు. బీసీలకు 75 ఏళ్లుగా ఈ దేశంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ రణభేరి గ్రామ గ్రామానా కొనసాగుతూనే ఉంటదని స్పష్టం చేశారు. బీసీ ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఇటీవల కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కనీస వసతులు లేని అద్దె భవనాలలోని హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకోలేని దుస్థితి నెలకొందన్నారు.